Old Age People: 65 ఏళ్లకు పైబడిన వృద్దులు ఇళ్లకే పరిమితం కావాలి: కేంద్రం తాజా మార్గదర్శకాలు

Centre issues new directives to states due to corona scares
  • 12 ఏళ్ల లోపు పిల్లలను బయట తిరగనివ్వరాదని స్పష్టీకరణ
  • వారం రోజుల పాటు అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిపివేత
  • ప్రతి ప్రయాణికుడికి 14 రోజుల పరిశీలన తప్పనిసరి చేస్తూ ఆదేశాలు
కరోనా మహమ్మారి తీవ్రత పెరుగుతోందన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు ఇళ్లకే పరిమితం కావాలని, బయటికి రావొద్దని సూచించింది. 12 ఏళ్ల లోపు ఉన్న పిల్లలను కూడా బహిరంగ ప్రదేశాల్లో తిరగనివ్వరాదని పేర్కొంది. అంతేకాకుండా, దేశవ్యాప్తంగా అంతర్జాతీయ, వాణిజ్య విమానాలకు అనుమతి నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 22 నుంచి కనీసం వారం రోజుల పాటు అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతి ఉండదని పేర్కొన్నారు.

కొందరు విమానాశ్రయాల నుంచి తప్పించుకుని రైలు మార్గాలు, రోడ్డు మార్గాల ద్వారా వెళ్లిపోతున్నందున వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలంటే విమాన సర్వీసుల నిలిపివేత తప్పదని కేంద్రం భావిస్తోంది. విమాన సర్వీసుల నిలిపివేత 22 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని, అప్పటివరకు అంతర్జాతీయ విమాన సర్వీసుల ద్వారా భారత్ చేరుకునే ప్రతి ఒక్క ప్రయాణికుడిని క్వారంటైన్ శిబిరాలకు తరలించాలని కేంద్రం ఆదేశించింది. 14 రోజుల పరిశీలన తర్వాత వారికి ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని తేలితేనే బయటికి పంపాలని స్పష్టం చేసింది.

ప్రజా రవాణా సంస్థలు సర్వీసులు తగ్గించుకోవాలని సూచించింది. వారం పాటు అంతర్జాతీయ సరిహద్దులు కూడా మూసివేస్తున్నట్టు స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ గ్రూప్ బి, సి ఉద్యోగులు 50 శాతం మంది మాత్రమే కార్యాలయాలకు రావాలని, మిగిలిన 50 శాతం మంది సిబ్బందిని ఇంటి నుంచే పనిచేయాలని పేర్కొంది. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని వివరించింది.
Old Age People
Corona Virus
International Flight Services
India
COVID-19

More Telugu News