Pullela Gopichand: టోక్యో ఒలింపిక్స్ వాయిదా వేయాలి: పుల్లెల గోపీచంద్
- కరోనా విస్తరిస్తోందన్న గోపీచంద్
- క్రీడాకారులను ఒత్తిడికి గురిచేయరాదని వెల్లడి
- ఐఓసీ త్వరగా ఓ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత హెచ్చుతున్న నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ వాయిదా వేయాలని భారత బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ అంటున్నారు. షెడ్యూల్ ప్రకారం జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు జపాన్ లోని టోక్యో వేదికగా ఒలింపిక్ క్రీడాపోటీలు జరగాల్సి ఉంది. జపాన్ సహా అనేక ఆసియా దేశాలు కరోనాతో సతమతమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) ఒలింపిక్ క్రీడలు సకాలంలోనే ప్రారంభం అవుతాయని అంచనా వేస్తోంది. దీనిపై స్పందించిన గోపీచంద్, ఒలింపిక్ క్రీడల నిర్వహణలో తనకు చాలా సందేహాలున్నాయని అన్నారు.
"కరోనా ఎక్కడో ఉంది, మనకేం కాదులే అనుకోవడానికి లేదు. కరోనాను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవ్వాల్సిన సమయం ఇది. అందుకే క్రీడాకారులను ఒత్తిడికి గురిచేయకుండా ఐఓసీ త్వరగా నిర్ణయం తీసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలపై ఆంక్షలు ఉన్నాయి. ప్రజల ఆరోగ్యమే పరమావధిగా యావత్ ప్రపంచం ఆలోచిస్తోంది. తాజా పరిణామాలు చూస్తుంటే ఒలింపిక్స్ ను వాయిదా వేయడమే మంచిదని భావిస్తున్నాను" అంటూ వ్యాఖ్యానించారు.