DGP: ఈసీ లేఖ టీడీపీ ఆఫీసుకు ఎలా వెళ్లింది?: అంబటి
- కేంద్రానికి లేఖ రాసిన ఎస్ఈసీ రమేశ్ కుమార్!
- వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ నేతలు
- లేఖ రాసింది ఎవరో విచారణ జరపాలని డీజీపీని కోరిన వైసీపీ ఎమ్మెల్యేలు
- ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతోందన్న అంబటి
స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదావేసిన అనంతరం తనకు, తన కుటుంబసభ్యులకు ప్రాణహాని ఉందంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేంద్ర హోంశాఖకు లేఖ రాసినట్టు ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని టీడీపీ అధికార పక్షం వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు డీజీపీని కలిసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖ వివాదంపై ఫిర్యాదు చేశారు. లేఖ రాసింది ఎవరో విచారణ జరపాలని కోరారు. సత్తెనపల్లి శాసనసభ్యుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. ఈసీ లేఖ టీడీపీ ఆఫీసుకు ఎలా వెళ్లిందని ప్రశ్నించారు. చంద్రబాబు కుట్రలను రమేశ్ కుమార్ అమలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారులపై దాడులు చేసే అలవాటు తమకు లేదని అంబటి స్పష్టం చేశారు. రమేశ్ కుమార్ కు అదనపు భద్రత కల్పించామని వివరించారు.