Telangana: తెలంగాణలో మరో మూడు పాజిటివ్ కేసులు.. 16కు పెరిగిన కరోనా బాధితుల సంఖ్య
- దుబాయ్ నుంచి వచ్చిన వ్యాపారికి కరోనా పాజిటివ్
- లండన్ నుంచి వచ్చిన మరో ఇద్దరు యువకులు
- వ్యాపారి కుటుంబ సభ్యులకు హోం క్వారంటైన్
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా నిన్న మూడు కొత్త కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య 16కు చేరింది. దుబాయ్ నుంచి ఈ నెల 14న నగరానికి వచ్చిన 50 ఏళ్ల వ్యాపారిలో 17న కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో అతడిని వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. అప్రమత్తమైన అధికారులు ఆయనను కలిసిన వారిని కూడా గృహ నిర్బంధంలో ఉంచారు. విమానంలో అతడితో కలిసి ప్రయాణించిన వారిని గుర్తించినట్టు అధికారులు తెలిపారు.
లండన్ నుంచి వచ్చిన మరో ఇద్దరు యువకులకు వైరస్ సోకింది. వీరిద్దరినీ నల్గొండ, సంగారెడ్డి జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. వారి కుటుంబాలు హైదరాబాద్‌లోనే ఉంటున్నాయి. వారిలో కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో వీరిద్దరిని కూడా ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.