Nirbhaya: తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేపారు... నిర్భయ దోషుల చివరి గంటన్నరలో జరిగిందిదే!

Nirbhaya Convicts last 90 Minutes

  • తొలుత స్నానం చేయాలని కోరిన అధికారులు
  • పూజ చేసుకునేందుకు అవకాశం ఇస్తే నిరాకరణ
  • అల్పాహారం తిరస్కరణ, ఆపై ఉరికంబం వద్దకు

దారుణాతి దారుణంగా అత్యాచారం చేసి, నిర్భయ మరణానికి కారణమైన కామాంధులకు ఎట్టకేలకు శిక్ష అమలైంది. నేటి సూర్యోదయాన్ని వారు చూసే అవకాశం లేదని నిన్న ఓ జైలు అధికారి చెప్పిన మాటలు నిజమయ్యాయి. ఇక వారి చివరి రోజు ఎలా గడిచిందంటే...

జైలు అధికారులు తెల్లవారుజామున 4 గంటలకే దోషులు ముఖేశ్‌ సింగ్‌ (32), వినయ్‌ శర్మ (26), అక్షయ్‌ ఠాకూర్‌ సింగ్‌ (31), పవన్‌ గుప్తా (25)లను నిద్ర లేపడానికి వెళితే, వారు మేల్కొనే వున్నారు. రాత్రంతా వారు నిద్రపోలేదని, పెద్దగా రోదిస్తూ వున్నారని తెలుస్తోంది. ఆపై వారిని స్నానం చేయాలని కోరారు. కానీ వారు స్నానం చేయడానికి, పూజలు చేసుకోవడానికి  తిరస్కరించారు.

ఆపై వారికి అల్పాహారాన్ని ఇచ్చారు. దాన్ని వారు తిరస్కరించారు. అప్పటికి సమయం 5 గంటలు దాటింది. ఆపై తీహార్ జైలు వైద్యులు నలుగురు దోషులనూ పరీక్షించి, వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని తేల్చారు. నలుగురినీ 3వ నంబర్ బ్యారక్ లో ముందుగానే సిద్ధం చేసిన ఉరికంబాల వద్దకు నడిపించారు. జిల్లా మెజిస్ట్రేట్ సమక్షంలో వారి ముఖాలను నల్లని కాటన్ వస్త్రంతో కప్పి, ఉరికంబాలపైకి ఎక్కించారు.

వారి చేతులను వెనక్కి కట్టారు. జిల్లా మేజిస్ట్రేట్ తో పాటు తిహార్ జైలు సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్, మెడికల్ ఆఫీసర్ తదితరుల సమక్షంలో 5.30 గంటలకు వారిని తలారి పవన్ జల్లాడ్ ఉరి తీశాడు. ఈ సందర్భంగా తలారిని దోషులెవరూ చూడకుండా జాగ్రత్త పడ్డారు. సుమారు అరగంట పాటు వారు ఉరికొయ్యకు వేలాడిన తరువాత, నలుగురూ మరణించినట్టు నిర్ధారించగా, వారి మృతదేహాలను కిందకు దించారు. మొత్తం 48 మంది సిబ్బందిని బందోబస్తు నిమిత్తం కేటాయించినట్టు జైలు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News