Kamalnath: ఓటింగ్ కు వెళ్లకుండా రాజీనామా... కమల్ నాథ్ కు కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశం!
- ఇప్పటికే మైనారిటీలో పడిపోయిన కమల్ నాథ్ సర్కారు
- మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం
- కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో బీజేపీ
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో నేడు కమల్ నాథ్ ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకోవాల్సి వుండగా, 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో ఇప్పటికే మెజారిటీని కోల్పోయిన కమల్ నాథ్ కు కాంగ్రెస్ హై కమాండ్ నుంచి కీలక ఆదేశాలు అందాయని తెలుస్తోంది. పార్టీ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం, అసెంబ్లీలో బల నిరూపణకు వెళ్లకుండా రాజీనామా చేయాలని కమల్ నాథ్ కు సూచించారు.
ఇప్పటివరకూ స్వల్ప మెజారిటీతో కమల్ నాథ్ నెట్టుకుని రాగా, యువనేత జ్యోతిరాదిత్య సింధియా తన వర్గం ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించిన సంగతి తెలిసిందే. దీంతో కమల్ నాథ్ సర్కారు మైనారిటీలో పడిపోయింది. నేడు బల నిరూపణ జరగాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, ప్రభుత్వ పతనం ఖరారైంది. 2 గంటలకు అసెంబ్లీ సమావేశం కానుండగా, 12 గంటలకు కమల్ నాథ్ మీడియాతో మాట్లాడనున్నారు.
ఇక తమకున్న బలంతో రాష్ట్రంలో తిరిగి అధికారాన్ని దక్కించుకునేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి బాధ్యతలు చేపడతారని బీజేపీ నేతలు అంటున్నారు.