Nirbhaya: ఉరికంబం వైపు నడుస్తూ, క్షమించాలని ప్రాధేయపడ్డ ముఖేశ్ సింగ్!
- ఉరి తీయవద్దని కోరిన ముఖేశ్ సింగ్
- పట్టించుకోకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించిన అధికారులు
- జైల్లో దోషులు సంపాదించిన డబ్బు కుటుంబీకులకు
మరికాసేపట్లో మరణిస్తామన్న సంగతి తెలిస్తే ఎవరికైనా ఎలా ఉంటుంది? కానీ, నిర్భయ దోషులకు మాత్రం తమ మరణం తథ్యమని తెలుసు. దాన్ని సాధ్యమైనంత వరకూ వాయిదా వేయిద్దామని చూసి, విఫలమయ్యారు. చివరి క్షణాలు వచ్చేసరికి వారిలో మరణ భయం స్పష్టంగా కనిపించిందని జైలు అధికారి ఒకరు తెలిపారు.
రాత్రంతా వారు నిద్రపోలేదని, తెల్లవారుజామున ఉరికంబం వద్దకు వారిని తీసుకుని వెళుతుంటే తనను క్షమించాలని ముఖేశ్ సింగ్ పదేపదే జైలు అధికారులను వేడుకున్నాడని తెలుస్తోంది. తనను ఉరి తీయవద్దని అడుగుతూ ఉంటే, అధికారులు మాత్రం అతని వ్యాఖ్యలను పట్టించుకోకుండా, తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. వీరిని ఉరి తీస్తున్న సమయంలో ఐదుగురు మాత్రమే ఆ ప్రాంతంలో ఉన్నారు.
ఇక జైలులో కూలి పనులు చేసిన పవన్, వినయ్, ముఖేశ్ లు కొంత డబ్బు సంపాదించుకోగా, దాన్ని ఇప్పుడు వారి కుటుంబ సభ్యులకు అందించనున్నారు. నాలుగో దోషి అక్షయ్ ఏ పనీ చేయలేదు. ఇక జైలులో దోషులు వాడిన వస్తువులను కూడా కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అధికారులు వెల్లడించారు.