Gold: మరోసారి రూ. 40 వేలు దాటిన పది గ్రాముల బంగారం ధర!
- ఇటీవలి కాలంలో భారీగా తగ్గిన ధర
- డాలర్ అనిశ్చితితో బులియన్ వైపు ఇన్వెస్టర్లు
- రూ. 40,136కు చేరిన ధర
ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టి, ఓ దశలో రూ. 38 వేలకు చేరిన పది గ్రాముల బంగారం ధర, స్టాక్ మార్కెట్లలో ఉత్సాహం, డాలర్ విలువలో అనిశ్చితి కారణంగా తిరిగి పైకి ఎగబాకింది. ఈ ఉదయం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 305 పెరిగి రూ. 40,136కు చేరుకుంది.
వివిధ దేశాల కరెన్సీతో పోలిస్తే డాలర్ విలువ పతనం కావడం, బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించిన కారణంగా పెట్టుబడిదారులు బులియన్ మార్కెట్ వైపు నడుస్తున్నారని, దీని వల్లే విలువైన లోహాల ధరలు పెరుగుతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక నేడు వెండి ధర కిలోకు రూ. 863 పెరిగి రూ. 35,965కు చేరుకుంది. రెండు నెలల క్రితం బంగారం ధర రూ. 44 వేలను దాటేసిన సంగతి తెలిసిందే. ఆపై సుమారు 5 వేలకు పైగా తగ్గి, ఇప్పుడు తిరిగి పుంజుకుంటోంది. అయితే, దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మాల్స్ మూతపడటం, ప్రజలు బయటకు రావడం తగ్గడంతో, బంగారం విక్రయాలు అంతంతమాత్రంగా సాగుతున్నాయని వ్యాపారులు అంటున్నారు.