wash your hands: చేతులు కడుక్కోవాలన్నందుకు వైద్యుణ్ణి కొట్టి చంపారు.. డూడుల్ తో స్మరించుకున్న గూగుల్!
- 1847లోనే చెప్పిన హంగేరీ డాక్టర్ ఇగ్నాజ్ సిమెల్వెస్
- అప్పట్లో పిచ్చొడి ముద్ర వేసిన ఇతర వైద్యులు
- మెంటల్ హాస్పిటల్‌లో గార్డుల దెబ్బకు చనిపోయిన దిగ్గజ వైద్యుడు
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వ్యక్తిగత శుభ్రత పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. ముఖ్యంగా తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గూగుల్ ఈ రోజు తన డూడుల్‌లో చేతులు ఎలా శుభ్రం చేసుకోవాలో ఓ వీడియోలో వివరించింది.
అంతేకాదు చేతులు కడుక్కుంటే ప్రాణాంతక వ్యాధులు రాకుండా నివారించొచ్చని వందేళ్ల కిందటే ఈ ప్రపంచానికి మొదటగా సూచించిన హంగేరీ డాక్టర్ ఇగ్నాజ్ సిమెల్వెస్‌ను స్మరించుకుంది. అయితే, చేతులు కడుక్కోవాలని చెప్పినందుకు పిచ్చోడి ముద్ర వేసి చివరకు సిమెల్వెస్‌ను అప్పట్లో కొట్టి చంపడం గమనార్హం.
సిమెల్వెస్ 1847లో సరిగ్గా ఇదే తేదీన వియాన్నా జనరల్ ఆసుపత్రిలో మెటర్నిటీ క్లినిక్‌లో చీఫ్ రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో ‘చైల్డ్ బెడ్ ఫీవర్’ (ప్రసవానంతర జ్వరం) వల్ల తల్లులు ఎక్కువగా చనిపోయేవారు. దీనిపై పరిశోధన చేసిన సిమెల్వెస్ డాక్టర్లు, నర్సులు క్లోరినేటెడ్ లైమ్ సొల్యూషన్స్‌తో చేతులు శుభ్రం చేసుకుంటే మరణాలు తగ్గుతాయన్నాడు.
కానీ, దీనికి ఆయన శాస్త్రీయ ఆధారాలు మాత్రం చూపలేకపోవడంతో వైద్యలు ఎగతాళి చేశారు. క్రమంగా విమర్శలు ఎక్కువయ్యాయి. వైద్యరంగం ఆయన్ని వెలేసింది. దాంతో ఆయన మతిస్థిమితం కోల్పోయారు. ఎప్పుడూ చైల్డ్ బెడ్ ఫీవర్ గురించే మాట్లాడేవారు. దాంతో పిచ్చిపట్టిందని భావించి పిచ్చోడని మెంటల్ హాస్పిటల్ లో గొలుసులతో కట్టేశారు. చివరికి 1865లో గార్డులు కొట్టిన దెబ్బలకు ఆయన చనిపోయారు.
సిమెల్వెస్ చనిపోయిన 20 ఏళ్లకు.. లూయీపాశ్చర్ ‘జెర్మ్ థియరీ’, జోసెఫ్ లీస్టర్ ‘హైజీనిక్ మెథడ్స్’ను శాస్త్రీయంగా నిరూపించారు. రాబర్ట్ కోచ్ అనే మరో శాస్త్రవేత్త కూడా వివిధ వైద్య పరికాలు, చేతుల ద్వారా రోగులకు ఇన్‌ఫెక్షన్స్ వస్తాయని తేల్చారు. అప్పటినుంచే సిమెల్వెస్ ‘హ్యాండ్ వాషింగ్ మీజర్స్’ను అందరూ ఒప్పుకున్నారు. ఇప్పుడు కరోనా వ్యాప్తి నేపథ్యంలో గూగుల్ ఆయన బొమ్మతో డూడుల్ వేసింది.