Donald Trump: కరోనా కాదు, అది చైనీస్ వైరస్... ట్రంప్ నోట మళ్లీ అదే మాట!
- ఇటీవలే కరోనాను చైనీస్ వైరస్ గా పేర్కొన్న ట్రంప్
- అలా పిలవడం సబబేనా అంటూ మీడియా ప్రశ్న
- అది కచ్చితంగా చైనాలో పుట్టిన వైరస్సేనంటూ ట్రంప్ పునరుద్ఘాటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాసేపు మాట్లాడితే చాలు అందులోంచి ఏదో ఒక వివాదం పుట్టుకొస్తుంది. ఇటీవల కరోనా వైరస్ ను చైనీస్ వైరస్ గా అభివర్ణించిన ఆయన చైనా అసంతృప్తిని చవిచూశారు. అయినప్పటికీ ఏం తగ్గకుండా, మరోసారి విలేకరుల సమావేశంలో చైనీస్ వైరస్ అని పలికారు.
ప్రస్తుతం అమెరికాలో చైనా జాతీయులపై విద్వేషపూరిత దాడులు చోటుచేసుకుంటున్న తరుణంలో కరోనా మహమ్మారిని చైనీస్ వైరస్ అనడం సమంజసం అనిపించుకుంటుందా? అని ట్రంప్ ను మీడియా ప్రశ్నించగా... చైనాలో పుట్టిన వైరస్ కాబట్టే దీన్ని చైనీస్ వైరస్ అంటున్నామని తడుముకోకుండా చెప్పారు.
"ఇది అమెరికా సైనికుల కారణంగానే వ్యాపించిందని చైనా అంటోంది. దీన్ని నేను అంగీకరించను. నేను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నంతకాలం అలా జరగదు. ఇది కచ్చితంగా చైనాలో ఉదయించిన వైరస్సే! ఈ విషయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఇందులో జాతివివక్షకు తావులేదు" అంటూ స్పష్టం చేశారు.