Peter Mukerjea: జైలు నుంచి విడుదలైన పీటర్ ముఖర్జియా
- నిన్న రాత్రి 8.45 గంటలకు విడుదలైన పీటర్ ముఖర్జియా
- ఆర్థర్ రోడ్ జైలు నుంచి నేరుగా వర్లీలోని నివాసానికి వెళ్లిన పీటర్
- ఇదే ఇంట్లో ఇంద్రాణి, షీనా బోరాతో కలిసి ఉన్న పీటర్ ముఖర్జియా
షీనా బోరా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంద్రాణి ముఖర్జియా మాజీ భర్త, మాజీ మీడియా బ్యారన్ పీటర్ ముఖర్జియా జైలు నుంచి విడుదలై స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి నిన్న రాత్రి 8.45 గంటలకు ఆయన విడుదలయ్యారు. 2015 నవంబర్ 25న సీబీఐ అధికారులు పీటర్ ముఖర్జియాను అరెస్ట్ చేశారు.
పీటర్ ముఖర్జియా బెయిల్ పై బాంబే హైకోర్టు విధించిన 6 వారాల స్టే ముగిసిపోవడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు రాగానే ఆయన నేరుగా వర్లీలోని తన పాత నివాసానికి చేరుకున్నారు. ఇదే ఇంట్లో ఇంద్రాణి ముఖర్జియా, షీనా బోరాలతో కలిసి ఆయన గతంలో నివసించేవారు.
2012లో షీనా బోరా హత్య జరిగింది. తన రెండో భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ సాయంతో షీనాను ఇంద్రాణి ముఖర్జియా హత్య చేయించింది. కేసును విచారించిన అధికారులు షీనా డెడ్ బాడీని వర్లీలోని ఇంట్లో ఒక రాత్రి ఉంచారని తేల్చారు. ఆ మరుసటి రోజు డెడ్ బాడీని ముంబై వెలుపల ఉన్న అడవికి తరలించి, అక్కడ తగలబెట్టారు. ఈ హత్యకు సంబంధించిన విషయం పీటర్ ముఖర్జియాకు కూడా తెలుసని సీబీఐ కేసు నమోదు చేసింది.
వర్లీలోని పీటర్ ముఖర్జియా ఇంట్లోనే తన తల్లితో పాటు షీనా బోరా నివసించేది. ఇదే సమయంలో పీటర్ ముఖర్జియా తొలి భార్యకు పుట్టిన రాహుల్ ముఖర్జియాతో ఆమె ప్రేమలో పడింది. వారి సంబంధాన్ని ఇంద్రాణి ముఖర్జియా ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో, కన్నకూతురుని ఆమె హత్య చేయించింది.