Rachakonda Police: శానిటైజర్ లేదా? అయితే ఇది జేబులో పెట్టుకోండి: రాచకొండ పోలీసులు
- శానిటైజర్ లేకపోతే సబ్బును జేబులో ఉంచుకోండి
- ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అనివార్యం
- ఇతరులు తాకిన ఏ వస్తువును ముట్టుకున్నా చేతులు కడుక్కోండి
ఏ అంశంపైన అయినా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హైదరాబాదులోని రాచకొండ కమిషనరేట్ పోలీసులు ముందుంటారు. కరోనా వైరస్ నేపథ్యంలో చేతులను ఎలా శుభ్రం చేసుకోవాలో వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు చూపించిన వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు జీబ్రా లైన్ వద్ద నిలబడి వారు చేతులు ఎలా కడుక్కోవాలో చేసి చూపించారు.
ఈ క్రమంలో రాచకొండ పోలీసులు ట్విట్టర్ ద్వారా మరో వీడియోని పోస్ట్ చేశారు. ఒక వేళ శానిటైజర్ అందుబాటులో లేకపోతే సబ్బుతో చేతులు కడుక్కోవాలంటూ ట్వీట్ చేశారు. వైరస్ ను సబ్బు ఎలా నిర్మూలిస్తుందో వీడియోలో తెలిపారు.
శానిటైజర్ లేని పక్షంలో సబ్బును జేబులో ఉంచుకోవాలని... ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అనివార్యమని ట్విట్టర్ లో తెలిపారు. ఇతరులు ముట్టుకున్న ఏ వస్తువును తాకినా 20 సెకన్ల పాటు చేతులను ముందు, వెనక కడుక్కోవడం మరవకండని చెప్పారు.