Finland: సంతోషకర దేశాల్లో భారత్ కంటే పాక్ చాలా మెరుగు!
- సంతోషకర దేశాల జాబితాలో భారత్ స్థానం 144
- 15వ స్థానంలో నేపాల్.. 29వ స్థానంలో పాక్
- టాప్-10లోకి తొలిసారి లగ్జెంబర్గ్
ప్రపంచంలో సంతోషకర దేశాల జాబితాలో భారతదేశం స్థానం 144. నేపాల్, పాకిస్థాన్ కంటే భారత్ చాలా వెనకబడి ఉండడం గమనార్హం. మొత్తం 153 దేశాల్లో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన ఈ సర్వేలో ఫిన్లాండ్ వరుసగా మూడోసారి టాప్ ప్లేస్‌ను దక్కించుకుని ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా రికార్డులకెక్కింది. డెన్మార్క్, స్విట్జర్లాండ్, ఐస్లాండ్, నెదర్లాండ్స్, స్వీడన్, న్యూజిలాండ్, ఆస్ట్రియా దేశాలు వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
దేశవ్యాప్తంగా ఉచిత ప్రయాణం అందుబాటులోకి తెచ్చిన తొలి దేశంగా రికార్డులకెక్కిన ఐరోపాలోని అతిచిన్న దేశం లగ్జెంబర్గ్ తొలిసారి టాప్-10లో చోటు సంపాదించుకుంది. ఇక ఈ జాబితాలో భారత్ 144వ స్థానంలో నిలవగా నేపాల్ 15, పాకిస్థాన్ 29, బంగ్లాదేశ్ 107, శ్రీలంక 130 స్థానాల్లో నిలిచాయి. ఈ సమాచారం మొత్తం గత రెండేళ్లలో సేకరించినది కావడంతో ప్రస్తుత కరోనా ఆందోళన ప్రభావం ఈ నివేదికపై లేదని ఐరాస స్పష్టం చేసింది.