Telangana: 'జనతా కర్ఫ్యూ'పై కౌన్సిలర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. కేసు నమోదు చేసిన సంగారెడ్డి పోలీసులు
- సీఏఏ చట్టాన్ని తొలగించేంత వరకు మోదీ మాటలను పట్టించుకోవద్దు
- జనం రోడ్లపైకి వచ్చి ఎంజాయ్ చేయాలని వీడియో
- కేసు నమోదు చేసి గృహ నిర్బంధంలో ఉంచిన పోలీసులు
ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపును పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అందరూ రోడ్లపైకి వచ్చి ఎంజాయ్ చేయాలంటూ సంగారెడ్డి జిల్లాలో ఓ కౌన్సిలర్ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసులు స్పందించారు. కేసు నమోదు చేసి గృహనిర్బంధంలో ఉంచారు. పట్టణంలోని 34వ వార్డు కౌన్సిలర్ అయిన షమీ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశారు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వెనక్కి తీసుకునేంత వరకు మోదీ మాటలను పట్టించుకోవద్దని, జనతా కర్ప్యూను పట్టించుకోకుండా అందరూ రోడ్లపైకి వచ్చి ఎంజాయ్ చేయాలని ఆ వీడియోలో పేర్కొన్నారు. జనతా కర్ఫ్యూకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన షమీపై కేసు నమోదు చేసి గృహనిర్బంధంలో ఉంచినట్టు సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.