Vijayawada: పెళ్లి కోసం అమెరికా నుంచి పిఠాపురానికి వచ్చిన జంట.. స్థానికుల ఆందోళనతో ఆగిన వివాహం!

Marriage halt amid corona fear in Pithapuram

  • అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న వధూవరులు
  • నిన్న ఉదయం పెళ్లి ముహూర్తం
  • వధువులో కనిపించని కరోనా లక్షణాలు

పెళ్లి కోసం అమెరికా నుంచి పిఠాపురం చేరుకున్న వధూవరులకు చేదు అనుభవం ఎదురైంది. వివాహానికి హాజరయ్యేందుకు లండన్, మస్కట్ నుంచి వారి స్నేహితులు రావడం, బంధువులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఆందోళన చెందిన స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో పెళ్లి వాయిదా పడింది. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో నిన్నంతా జనాలు ఇంటికే పరిమితం కాగా పెళ్లి పేరుతో పెద్ద ఎత్తున జనం రోడ్డుపైకి రావడంతో స్థానికులు ఆందోళన చెందారు.

విజయవాడకు చెందిన వరుడు, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన వధువు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. నిన్న ఉదయం 10:30 గంటలకు పిఠాపురంలో వీరి పెళ్లి జరగాల్సి ఉంది. వివాహానికి హాజరయ్యేందుకు ఇరువురి తరపున స్నేహితులు లండన్, మస్కట్ తదితర ప్రాంతాల నుంచి పిఠాపురం చేరుకున్నారు. బంధువులు కూడా పెద్ద ఎత్తున హాజరు కావడంతో ఆందోళన చెందిన స్థానికులు విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

కలెక్టర్ ఆదేశాలతో అక్కడికి చేరుకున్న వైద్య సిబ్బంది వధువును స్వీయ నిర్బంధంలో ఉంచారు. వరుడు అప్పటికింకా అక్కడికి చేరుకోలేదు. మరోవైపు, లండన్, మస్కట్ నుంచి వచ్చిన వారితోపాటు పెళ్లి కోసం వచ్చిన వారి బంధువులకు కూడా పరీక్షలు నిర్వహించారు. వారం క్రితమే అమెరికా నుంచి వచ్చిన వధువులో కరోనా లక్షణాలు లేకున్నప్పటికీ స్వీయ నిర్బంధంలో ఉండాలని అధికారులు సూచించారు. దీంతో పెళ్లి కాస్తా వాయిదా పడింది.

  • Loading...

More Telugu News