Hyderabad: పెట్రోలు అమ్మకాలపై కరోనా ఎఫెక్ట్!
- హైదరాబాద్ లో రోజుకు 45 లక్షల లీటర్ల పెట్రోలు అమ్మకాలు
- ఇప్పటికే సగానికి పైగా తగ్గిన విక్రయాలు
- ఆదివారం ఒక్క శాతం అమ్మకాలు సాగలేదంటున్న బంక్ యజమానులు
నిత్యమూ సుమారు 45 లక్షల లీటర్ల పెట్రోల్, 34 లక్షల లీటర్ల డీజిల్ అమ్మకాలు సాగే హైదరాబాద్ లో పెట్రోలు బంకులు బోసిపోయాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు పెట్రోల్ బంకులు తెరిచే ఉన్నా, వాహనదారులు మాత్రం కనిపించలేదు. ఆదివారం నాటి జనతా కర్ఫ్యూ తరువాత, నేటి నుంచి లాక్ డౌన్ అమలులోకి రాగా, పెట్రోలు బంకుల్లో లేకుండా పోయింది. బంకుల్లో ఒకరిద్దరు సిబ్బంది మాత్రమే కనిపిస్తున్నారు. తమ అత్యవసరాల నిమిత్తం వాహనాలను రోడ్లపైకి తెస్తున్న వారిలో ఒకరిద్దరు మాత్రమే పెట్రోల్ కోసం వెళుతున్న పరిస్థితి.
వైరస్ వ్యాపించకుండా ఇప్పటికే విద్యా సంస్థలు, సినిమా హాల్స్, గోల్కొండ, చార్మినార్ వంటి పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు మూసి వేయడంతో గడచిన వారం రోజులుగా అంతంతమాత్రంగా ఉన్న అమ్మకాలు, ఇప్పుడు కనిష్ఠానికి పడిపోయాయి. సగటున సాగే రోజువారీ అమ్మకాలతో పోలిస్తే, ఆదివారం నాడు ఒక్క శాతం కూడా విక్రయాలు సాగలేదని బంకు యజమానులు వెల్లడించారు.