IMD: నేడు, రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు: హెచ్చరించిన హైదరాబాద్ వాతావరణ శాఖ
- దక్షిణాది రాష్ట్రాలపై ఉపరితల ఆవర్తనం
- కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన
- అంచనా వేసిన ఐఎండీ అధికారులు
దక్షిణాది రాష్ట్రాలపై విస్తరించిన ఉపరితల ఆవర్తనం కారణంగా, నేడు, రేపు తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమల్లోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు. తెలంగాణ నుంచి ఉత్తర కేరళ వరకూ.. అలాగే రాయలసీమ నుంచి కర్ణాటక వ్యాప్తంగా ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీనికి అనుబంధంగా కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో నేడు, రేపు వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానకు అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు.