Banks: అవసరం ఉంటే తప్ప బ్యాంకులకు రావొద్దు.. మాకు మీ సాయం కూడా అవసరం: బ్యాంకు ఉద్యోగుల సంఘం విన్నపం
- ఆన్‌లైన్, మొబైల్ సేవలను వినియోగించుకోండి
- అన్ని రకాల సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం
- అందరూ ఎదుర్కొంటున్న సమస్యనే ఉద్యోగులూ ఎదుర్కొంటున్నారు
బ్యాంకు ఖాతాదారులకు అన్ని సేవలు అందిస్తామని అయితే, అత్యవసరం అయితే తప్ప బ్యాంకుకు రావొద్దని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీవో) విజ్ఞప్తి చేసింది. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని, శక్తివంచన లేకుండా పనిచేస్తామని పేర్కొంది. వీలైనంత వరకు అన్ని సేవలు అందిస్తామని, ఈ విషయంలో వినియోగదారులు కూడా తమవైపు నుంచి సాయం చేయాలని కోరింది. ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్యలనే బ్యాంకు ఉద్యోగులు కూడా ఎదుర్కొంటున్నారని, కాబట్టి అత్యవసరం అనుకుంటే తప్ప బ్రాంచ్‌లకు రావొద్దని కోరింది.
మొబైల్, ఆన్‌లైన్ బ్యాకింగ్ చానల్స్ ద్వారా అందుబాటులో ఉన్న నాన్-ఎస్సెన్షియల్ సేవలను ఉపయోగించుకోవాలని, 24 గంటలూ ఆ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఐబీవో అధికారులు తెలిపారు. అవసరం అనుకుంటే బ్యాంకులకు ఫోన్ చేయొచ్చని, ఐవీఆర్ సదుపాయాన్ని కూడా పొందొచ్చని పేర్కొన్నారు. నగదు జమ, ఉపసంహరణ, చెక్ క్లియరెన్స్, రెమిటెన్స్, ప్రభుత్వపరమైన లావాదేవీలు వంటివి తప్పకుండా అందుబాటులో ఉంటాయని వివరించారు.