Medak District: ఫైనాన్స్ వ్యాపారుల దాష్టీకం... మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
- బైక్‌పై స్నేహితుడి పెళ్లికి వెళ్లిన యువకుడు
- డబ్బు కట్టలేదని మండపం నుంచి తీసుకువెళ్లిన వ్యాపారులు
- అవమానంగా భావించి బలవన్మరణం
ప్రైవేటు ఫైనాన్స్ వ్యాపారుల దాష్టీకానికి ఓ నిండు ప్రాణం బలైంది. రుణం తీసుకుని కొన్న బండి వాయిదాలు చెల్లించలేదన్న కారణంతో సాక్షాత్తు పెళ్లి మండపం నుంచి బైక్‌ను వ్యాపారులు తీసుకువెళ్లారు. వందల మంది బంధువులు, స్నేహితుల సమక్షంలో జరిగిన ఈ అవమానాన్ని తట్టుకోలేక ఆ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే...మెదక్ జిల్లా తూఫ్రాన్ పట్టణ పరిధి రావెల్లికి చెందిన అనుమోళ్ల మహేశ్ (22) ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు.
కంపెనీకి వెళ్లేందుకు సౌకర్యవంతంగా ఉంటుందని ఫైనాన్స్‌పై బండి కొన్నాడు. కొన్ని వాయిదాలు కట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం చేగుంటలో జరిగిన స్నేహితుడి పెళ్లికి బండిపై వెళ్లాడు. అదే సమయంలో వచ్చిన ఫైనాన్స్ వ్యాపారులు డబ్బు కట్టలేదని బండి తీసుకుని వెళ్లిపోయారు. కొన్నిరోజుల్లో చెల్లిస్తానని ఎంతగా ప్రాధేయపడినా వినలేదు.
పెళ్లి మండపంలో జరిగిన అవమానంతో మనస్తాపానికి గురైన మహేశ్ ఇంటికి వచ్చి తండ్రి స్వామికి విషయం చెప్పాడు. దీంతో బకాయి చెల్లించేందుకు ప్రైవేటు అప్పుకోసం ఊర్లో తల్లిదండ్రులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నలుగురి ముందు పరువు పోయిందని భావించిన మహేశ్ రావెల్లిలోని ఇంట్లో శనివారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తూప్రాన్ పోలీసులు విచారణ చేస్తున్నామని తెలిపారు.