Telangana: తెలుగు రాష్ట్రాల మధ్య సరిహద్దుల బంద్... నిలిచిన వందలాది వాహనాలు!
- అంతర్ రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద భారీగా పోలీసులు
- కోదాడ వద్ద 5 కిలోమీటర్లు నిలిచిన వాహనాలు
- పోలీసులతో వాహనదారుల వాగ్వాదం
కరోనా భయాలు, లాక్ డౌన్ నేపథ్యంలో స్వగ్రామాలకు వెళ్లేందుకు తమ సొంత వాహనాల్లో బయలుదేరిన వారందరినీ వివిధ చెక్ పోస్టుల వద్ద పోలీసులు అడ్డుకుంటున్నారు. కోదాడ, పెబ్బేరు, భద్రాచలం, నాగార్జున సాగర్, జహీరాబాద్ అంతర్ రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద భారీ ఎత్తున మోహరించిన పోలీసులు, ఇటు నుంచి అటు వెళ్లే వాహనాలను నిలిపివేస్తున్నారు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వచ్చే వాహనాలను అనుమతించడం లేదు. కోదాడ వద్ద సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోగా, పలువురు వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
కాగా, పాలు, కూరగాయలు, మందులకు సంబంధించిన అత్యవసర వాహనాలను మాత్రమే తెలంగాణలోకి అనుమతిస్తామని, అలాంటి వాటినే రాష్ట్రం నుంచి బయటకు వెళ్లనిస్తామని పోలీసు అధికారులు తేల్చి చెబుతున్నారు. చెక్ పోస్టుల వద్ద హెల్త్, పోలీస్, రవాణాశాఖ సిబ్బంది మూడు షిఫ్ట్ లలో పని చేస్తున్నారని, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నెలాఖరు వరకూ లాక్ డౌన్ కు ప్రజలంతా సహకరించాలని సూచిస్తున్నారు.