olympics: ఒలింపిక్స్ రద్దు చేయం.. వాయిదాపై నాలుగు వారాల్లో నిర్ణయం: ఐఓసీ
- అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు బాచ్ కీలక ప్రకటన
- ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ అన్ని దేశాల అథ్లెట్లకు లేఖ
- జులై 24న మొదలవ్వాల్సిన విశ్వ క్రీడలు
కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచం కుదేలవుతుండగా.. ఈ ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే అన్ని దేశాల్లో ఆటలు ఆగిపోయాయి. క్రీడాకారుల శిక్షణ కూడా నిలిచిపోయింది. చాలా దేశాలు ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒలింపిక్స్‌ను రద్దు చేయాలని, లేదంటే వచ్చే ఏడాదికి వాయిదా వేయాలన్న డిమాండ్లు పెరిగాయి. అయితే, మరో నాలుగు నెలల సమయం ఉందని, అప్పటిలోగా పరిస్థితి మెరుగవుతుందని చెబుతూ వచ్చిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఎట్టకేలకు పునరాలోచనలో పడింది.
విశ్వక్రీడలను వాయిదా వేసే ఆలోచన తమకు లేదని స్పష్టం చేసిన ఐఓసీ.. వాయిదా వేయాల్సివస్తే దానిపై నాలుగు వారాల్లో తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఈ మేరకు ఐఓసీ అధ్యక్షుడు థామస్ కీలక ప్రకటన చేశారు. అలాగే, ఒలింపిక్స్‌కు సన్నద్ధం అవుతున్న అన్ని దేశాల అథ్లెట్లకు లేఖ రాశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐఓసీ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో వివరించారు.