Telangana: లాక్‌డౌన్ పకడ్బందీగా అమలు.. ఉల్లంఘనలకు పాల్పడితే క్రిమినల్ కేసులు: తెలంగాణ డీజీపీ
- ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలి
- డే టైం లో నిత్యావసర వస్తువులు
- రాత్రి 7 గంటలకు క్లోజ్
- ప్రతి వాహనాన్ని పోలీసులు పరిశీలిస్తారు
తెలంగాణలో లాక్‌డౌన్ పకడ్బందీగా అమలు చేస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ రోజు హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కరోనా వైరస్ తీవ్రంగా ఉన్నందున ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు. తెలంగాణ సమాజం కోసమే పోలీసులు కఠినంగా ఆంక్షలు అమలు చేస్తారని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
పగటి పూట అందుబాటులో వుండే నిత్యావసర వస్తువుల దుకాణాలు అన్నీ రాత్రి 7 గంటలకు క్లోజ్ చేస్తామని చెప్పారు. ఒక కాలనీ లో వెహికిల్ లో ఒకటి రెండు కిలో మీటర్లు మాత్రమే తిరగాలని చెప్పారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ప్రతి వాహనాన్ని పోలీసులు పరిశీలిస్తారని, ఎక్కువ సార్లు పోలీసుల దృష్టిలో పడితే వెహికిల్ సీజ్ చేస్తారని మహేందర్ రెడ్డి తెలిపారు. సీజ్ చేసిన వాహనాలు వైరస్ తీవ్రత తగ్గిన తరువాత రిలీజ్ చేస్తారని చెప్పారు. ప్రైవేట్ వాహనాలు నిత్యావసర వస్తువుల క్యారీకి మాత్రమే అనుమతి ఇస్తున్నామని తెలిపారు. మీడియాకు ఎక్కడైనా తిరిగే అనుమతులు ఇస్తున్నట్లు ప్రకటించారు
చట్టం చాలా కఠినంగా అమలు చేస్తామని డీజీపీ చెప్పారు. ఉల్లంఘనలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామన్నారు. ప్రతి బైక్ పై ఒక వ్యక్తి... ఫోర్ వీలర్ పై ఇద్దరికి మాత్రమే అనుమతి ఉందని తెలిపారు. ఆటో అసోషియేషన్ కి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసామని, చట్టం అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పారు.
ఈ రోజు మధ్యాహ్నం నుంచి కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ప్రైవేట్ వాహనాలు ఎమర్జెన్సీ పనులకు మాత్రమే ఉపయోగించాలని కోరారు. వచ్చే పది రోజులు క్రమశిక్షణతో ఉండాలని చెప్పారు. కరోనా సమస్యను అరికట్టాలంటే ప్రజలు రోడ్ల పైకి రావద్దన్నారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.