Reliance: కరోనా బాధితులు, ఉపాధి కోల్పోయిన వారి కోసం రిలయన్స్ దాతృత్వం
- ముంబయిలోని తమ ఆసుపత్రిలో 100 పడకలు ఏర్పాటు
- కరోనా రోగులను తరలించే వాహనాలకు ఉచితంగా ఇంధనం
- ఉపాధి కోల్పోయిన వారికి ఆహారం పంపిణీ
దేశంలో కరోనా వైరస్ క్రమంగా అనేక రాష్ట్రాలకు పాకుతున్న నేపథ్యంలో రిలయన్స్ సంస్థ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముంబయిలోని రిలయన్స్ కార్పొరేట్ సోషల్ సర్వీస్ విభాగానికి చెందిన ఆసుపత్రిలో 100 పడకలు ఏర్పాటు చేసి కరోనా రోగులకు చికిత్స అందిస్తామని ప్రకటించింది.
కరోనా రోగులను తరలించే వాహనాలకు ఉచితంగా ఇంధనం సమకూర్చుతామని, లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి అనేక నగరాల్లో ఉచిత ఆహారం అందిస్తామని వివరించింది. అంతేకాకుండా, రోజుకు 1 లక్ష మాస్కులు తయారుచేసి సరఫరా చేస్తామని రిలయన్స్ వర్గాలు తెలిపాయి. తమ సంస్థకు చెందిన ఒప్పంద, తాత్కాలిక ఉద్యోగులను ఆదుకునే చర్యల్లో భాగంగా జీతాలు చెల్లిస్తామని రిలయన్స్ అధికారులు తెలిపారు.