Italy: ఇటలీలో పెరుగుతున్న మరణాలు... ఆంక్షలు తీవ్రతరం చేసిన ప్రభుత్వం
- ఇటలీలో కరోనా మృత్యుఘంటికలు
- నిన్న ఒక్క రోజే 651 మంది మృతి
- ఇప్పటివరకు 5,476 మరణాలు
- ఆంక్షలు ఉల్లంఘిస్తే రూ.4 లక్షల వరకు జరిమానా
యూరప్ దేశాలన్నింటిలో కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా నష్టపోతున్న దేశం ఇటలీ. అక్కడ ఇప్పటివరకు 5,476 మరణాలు సంభవించాయి. ఆదివారం 651 మంది ప్రాణాలు విడిచారు. బాధితుల సంఖ్య 50 వేల పైచిలుకు దాటింది. ముఖ్యంగా, ఇటలీలోని లొంబార్డీ ప్రాంతం కరోనా కారణంగా హడలిపోతోంది. ఈ ప్రాంతంలోనే అత్యధిక మరణాలు సంభవించాయి.
ఈ నేపథ్యంలో ఇటలీ ప్రభుత్వం ఆంక్షలు తీవ్రతరం చేసింది. ఉత్తర ఇటలీలో ప్రజలు బహిరంగంగా వ్యాయామం చేయడం నిషిద్ధమని ప్రకటించారు. తమ ఇంటి నుంచి 650 అడుగుల దూరం వరకే పెంపుడు శునకాలను వాకింగ్ కు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో తిరగడంపైనా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే రూ.4 లక్షల వరకు జరిమానా ఉంటుందని హెచ్చరించారు.