Corona Virus: కరోనా మృత్యు ఘోష.. ప్రపంచవ్యాప్తంగా 15 వేలు దాటిన మరణాలు!
- 15,189కి కరోనా మరణాల సంఖ్య
- యూరప్‌లో అత్యధికంగా 9,197 మంది మృతి
- 24 గంటల్లో 1,395 మంది బలి
కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా మరణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారినపడి మృతిచెందిన వారి సంఖ్య 15 వేలు దాటిపోయింది. తాజా గణాంకాల ప్రకారం.. కోవిడ్-19 బారినపడి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 15,189 మంది చనిపోయారు. వీరిలో ఒక్క యూరప్ వాసులే 9,197 మంది ఉండడం గమనార్హం.
గత 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 1,395 మంది ప్రాణాలు కోల్పోగా, అందులో 462 మంది స్పెయిన్ దేశస్తులు కావడం గమనార్హం. తాజా మరణాలతో స్పెయిన్‌లో మృతి చెందినవారి సంఖ్య 2,182కి చేరుకుంది. ఈ విషయాన్ని ఆ దేశ వైద్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య 33,089కి చేరింది. ఇటలీలో 5,476 మందిని కరోనా మహమ్మారి బలితీసుకోగా, చైనాలో 3,270, స్పెయిన్‌లో 2,182 మంది ప్రాణాలు కోల్పోయారు.