Medak District: దయచేసి మా ఊరికి ఎవరూ రావొద్దు.. గేటు కట్టి దండం పెడుతున్న గ్రామస్థులు!
- ఎవరూ రాకుండా గేట్లు అడ్డం పెడుతున్న వైనం
- రోడ్లపై ట్రాక్టర్లు, ట్యాంకర్లతో వాహనాల అడ్డగింత
- ఎవరూ రావొద్దంటూ చాటింపు
నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు తీస్తున్న కరోనా మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉంటున్నారు. అత్యవసరమైతే తప్ప కాలు బయటపెట్టేందుకు సాహసించడం లేదు. మరోవైపు ఆంక్షలు ఉండనే ఉన్నాయి. నగరాలు, పట్టణాల్లో ఈ పరిస్థితి ఇలా ఉంటే, గ్రామాలు కూడా ఇప్పుడు పూర్తి అప్రమత్తంగా ఉంటున్నాయి.
బయటి వ్యక్తులు తమ ఊరిలోకి రాకుండా ఎక్కడికక్కడ గేట్లు అడ్డం పెట్టేస్తున్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని వరిగుంతల గ్రామమైతే పూర్తి నిర్బంధంలోకి వెళ్లిపోయింది. ఊరిలోకి వచ్చే దారులన్నింటినీ మూసివేశారు. రోడ్లపైకి జనాలు రాకుండా వీఆర్వోలను కాపలా పెట్టారు. తమ గ్రామంలోకి ఎవరూ రావొద్దని చాటింపు వేయించారు.
కామారెడ్డి జిల్లాలోని జుక్కల్, మద్నూరు మండలాల్లోని గ్రామాలు కూడా గ్రామ సరిహద్దుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఎవరూ గ్రామంలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. ట్రాక్టర్లు, ట్యాంకర్లను అడ్డం పెట్టి వాహనాలు రాకుండా జాగ్రత్త తీసుకున్నారు. పాదచారులను కూడా గ్రామంలోకి అనుమతించడం లేదు.