Harish Rao: లాక్ డౌన్ కి సహకరించండి.. అందరూ ఇంట్లోనే వుండండి: తెలంగాణ మంత్రి హరీశ్ రావు
- దయచేసి అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోండి
- మార్చి 31 వరకు అందరూ ఇళ్లలోనే ఉండండి
- ఇటలీ కి పట్టిన గతి మనకు పట్టొద్దంటే అది మీ చేతుల్లోనే ఉంది
'ప్రజలందరికీ విజ్ఞప్తి' అంటూ కరోనా విజృంభణపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఓ వీడియో విడుదల చేశారు. 'కరోనా అనే వైరస్ మొత్తం ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా అనే రోగ క్రిమి వల్ల కొవిడ్ 19 అనే జబ్బు వస్తుంది. 2019 డిసెంబర్ లో చైనా లోని వూహాన్ నగరంలో బయటపడ్డ ఈ వైరస్ 150 దేశాలకు పాకింది' అని తెలిపారు.
'ఇప్పటివరకు తెలుస్తున్న సమాచారం ప్రకారం చైనాలో సుమారు 5,000 మంది మరణించగా ఇటలీలో ఇంతకు రెట్టింపు 10,000 మంది మరణించారు. ఈ వైరస్ మన దేశంలోకి మన రాష్ట్రం లోకి కూడా ప్రవేశించింది. ఇది ఒకరినుండి ఒకరికి సోకే భయంకరమైన అంటువ్యాధి. నిన్నటిదాకా రాష్ట్రంలోకి వచ్చిన విదేశీయులలోనే కనిపించిన ఈ వ్యాది ఇప్పుడు మన రాష్ట్రంలోనే ఉన్న వారికి కూడా సోకుతున్నది. ఇది ప్రాణాంతకమైన వైరస్. ఇది సోకకుండా ఉండేందుకు వాక్సిన్ ఇంకా కనుక్కోలేదు. ఇప్పుడు మనల్ని మనం కాపాడుకోగలిగేది కేవలం ముందు జాగ్రత్తల ద్వారా మాత్రమే' అని హరీశ్ రావు అన్నారు.
'చేతులు జోడించి అందరినీ వేడుకుంటున్నాను. దయచేసి అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీరు తీసుకునే జాగ్రత్తల వల్ల మీరు మీ ప్రాణాన్ని కాపాడుకోవటమే కాకుండా వేలాది మంది ప్రాణాలు కాపాడిన వాళ్లవుతారు. మొదటిది మార్చి 31 వరకు అందరూ ఇళ్లలోనే ఉండండి. మంది గుంపులుగా ఉంటే ఈ జబ్బు వేగంగా వ్యాప్తి చెందుతుంది. అందుకని అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటికి రాకండి' అని తెలిపారు.
'రెండవ జాగ్రత్త ఎవరైనా విదేశాల నుండి వస్తే వెంటనే ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇవ్వండి. వారికి వైద్య పరీక్షలు చేస్తారు. విదేశాల నుండి వచ్చిన వారు జబ్బు ఉన్నా లేకున్నా 14 రోజుల పాటు బయటికి రాకుండా ఇంట్లోనే ఉండండి. మామూలుగా ఈ జబ్బు వైరస్ తో కలుషితమైన ప్రాంతాన్ని గానీ, వస్తువులనుగానీ మన చేతులతో తాకి ఆ చేతులతో ముఖాన్ని తాకితే వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది' అని హరీశ్ రావు చెప్పారు.
'అందుకనే నిరంతరం చేతులను సబ్బుతో గానీ శానిటైజర్ తో గానీ శుభ్రం చేసుకొండి. జ్వరమూ ఒళ్లు నొప్పులు, దగ్గు, గొంతు నొప్పి, తల నొప్పి వంటి లక్షణాలు ఎవరికీ ఉన్నా వెంటనే వైద్యున్ని సంప్రదించండి. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చేతి గుడ్డ అడ్డం పెట్టుకొండి. షేక్ హ్యాండ్ ఇవ్వడం మానేయండి. దూర ప్రయాణాలు చెయ్యకండి. ఫంక్షన్లు వాయిదా వేసుకోండి. మిమ్మల్ని కరోనా నుంచి రక్షించేందుకు ప్రభుత్వ వ్యవస్థ అప్రమత్తంగా సేవలందిస్తోంది' అని తెలిపారు.
కరోనా కట్టడి మీ చేతుల్లోనే ఉంది..
'ముఖ్యమంత్రిగారు స్వయంగా నిరంతరం పర్య వేక్షిస్తున్నారు. దయచేసి వీధుల్లోకి రాకండి. నాకేం అవుతుందిలే అనే మీ అజాగ్రత్త, మీ నిర్లక్ష్యం వల్ల మానవ వినాశనానికి మీరు కారణం అవుతారు. పరిస్థితిలో ఉన్న గంభీరతను గమనించండి. ఇటలీ దేశానికి పట్టిన గతి మనకు పట్టొద్దంటే అది మీ చేతుల్లోనే ఉంది. ఇంట్లోనే ఉండండి. సురక్షితంగా ఉండండి. ఒకరి నుండే ఒకరికి వ్యాపించే గొలుసు కట్టును ఛేదించడం ద్వారానే కరోనా ను కట్టడి చేయగలుగుతాం' అని హరీశ్ తెలిపారు.
'ప్రభుత్వ ఆజ్ఞలు మీరి ప్రవర్తిస్తే జరిమానాలు విధించటంతో పాటు కేసులు కూడా బుక్ చేయవలసి వస్తుంది. పోలీసులకు సహకరించండి. విజ్ఞతతో ప్రవర్తించండి. జనతా కర్ఫ్యూను విజయవంతం చేసినట్టే మార్చి 31 వరకు ఉన్న లాక్ డౌన్ అంటే సకలం బంద్ ను కూడా విజయవంతం చేయండి. కరోనా నివారణ లోనూ ముందుందాం.. మరోసారి మీ అందరికి చేతులు ఎత్తి నమస్కరించి చెబుతున్నా.. ఇంట్లోనే ఉండండి సురక్షితంగా ఉండండి' అని హరీశ్ రావు చెప్పారు.