Rajya Sabha: ఎల్లుండి జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలు వాయిదా!
- 31 తరువాత సమీక్షించి తదుపరి ఎన్నికల తేదీ
- ఈ పరిస్థితుల్లో ప్రజా ప్రతినిధులు ఒక చోట చేరడం మంచిది కాదు
- మీడియాకు వెల్లడించిన ప్రకటనలో ఎలక్షన్ కమిషన్
దేశవ్యాప్తంగా కరోనా భయాలు పెరిగిపోయిన వేళ, ఈ నెల 26న జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలు వాయిదా పడ్డాయి. మార్చి 31 తరువాత పరిస్థితిని సమీక్షించి, ఎన్నికలు ఎప్పుడు జరిపించాలన్న తేదీని నిర్ణయిస్తామని ఎన్నికల కమిషన్ కొద్దిసేపటి క్రితం మీడియాకు ఓ ప్రకటనలో తెలిపింది.
"దేశంలో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ నెలకొని వుంది. ఈ సమయంలో పెద్ద ఎత్తున ప్రజలు ఒకేచోట చేరడం నిబంధనలకు విరుద్ధం. అది ప్రజాప్రతినిధులైనా సరే. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికలు వాయిదా వేస్తున్నాం" అని ఈసీ వెల్లడించింది.
ఎన్నికల సందర్భంగా పోలింగ్ అధికారులు, ఏజంట్లు, రాజకీయ పార్టీల ప్రముఖులు, సహాయక అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలంతా ఒకే చోట కలవాల్సి వుంటుందని గుర్తు చేసిన ఈసీ, లాక్ డౌన్ అమలులో ఉన్న ఈ పరిస్థితుల్లో ఇలా కలవడం మంచిది కాదని అభిప్రాయపడింది. ఏదైనా అనుకోని అనారోగ్య పరిస్థితి ఎవరికి తలెత్తినా, అందరూ బాధపడాల్సి వుంటుందని వ్యాఖ్యానించింది.
కాగా, రాజ్యసభకు ఖాళీ అయిన 55 సీట్లలో, ఏకగ్రీవాలు అయిన 37 మినహా మిగతా 18 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి వుంది. గుజరాత్, ఆంధ్రప్రదేశ్ లో నాలుగేసి, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో మూడేసి, రాజస్థాన్ లో రెండు మణిపూర్, మేఘాలయా రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగాల్సివుంది.