Corona Virus: తెలంగాణలో ‘కరోనా’ అనుమానితుల గుర్తింపుకు ప్రత్యేక యాప్ ప్రారంభం
- ప్రత్యేక యాప్ ను ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ
- యాప్ వినియోగంపై కలెక్టర్లకు ఆరోగ్య శాఖ డైరెక్టర్ లేఖ
- సమాచారాన్ని సేకరించిన ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ అనుమానిత కేసులను గుర్తించి, నమోదు చేయడానికి గాను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక యాప్ ను ప్రారంభించింది. ఈ యాప్ ను ఎలా వినియోగించాలన్న విషయమై జిల్లా కలెక్టర్లకు ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఈ మేరకు ఓ లేఖ రాశారు.
విదేశాల నుంచి రాష్ట్రానికి ఎంత మంది వచ్చారు, ఎందరు హోం క్వారంటైన్ లో ఉన్నారు, ‘కరోనా’ అనుమానిత లక్షణాలతో ఎంత మంది బాధపడుతున్నారు, ఎంత మంది స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారన్న సమాచారాన్ని గ్రామాల వారీగా ఉన్న ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి సేకరిస్తారు.
అలా సేకరించిన సమాచారాన్ని వారు తమ వద్ద వుండే ట్యాబ్ లలోని యాప్ లోకి అప్ లోడ్ చేస్తారు. ఈ అప్ లోడ్ చేసిన సమాచారం ఆధారంగా గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయులలో అధికారులు సమీక్షించి తగు చర్యలు చేపడతారు. ఈ యాప్ ను మరింతగా విస్తరించి ప్రజలకు అందుబాటులోకి తేవాలనే ప్రయత్నాలు చేస్తారని సంబంధిత అధికారుల సమాచారం.