Peddapalli District: ‘కరోనా’ వ్యాప్తి నిరోధానికి సహకరించాలంటూ పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ వినూత్న ప్రచారం
- ‘కరోనా’ నివారణకు ముందు జాగ్రత్త చర్యలు పాటించాలి
- వినూత్న రీతిలో అవగాహన కల్పించిన పోలీసులు
- వాహనదారులకు దండాలు పెడుతూ ప్రయాణాలు చేయొద్దని వినతి
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం, వైద్య, ఆరోగ్య శాఖ, పోలీస్ అధికారులు నిరంతరం ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులు వినూత్న రీతిలో ప్రజలకు అవగాహన కల్పించారు. మన గ్రామంతో పాటు యావత్తు దేశం సురక్షితంగా ఉండాలంటే ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని, ప్రయాణాలు చేయొద్దని, ఇళ్లకే పరిమితం కావాలని వాహనదారులకు దండం పెడుతూ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. స్థానిక పెద్దపల్లి కమాన్ చౌరస్తా వద్ద... ‘అమ్మా, చెల్లీ, అన్నా’ అంటూ వాహనదారులను పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులు సంబోధిస్తూ, వారికి దండాలు పెడుతూ ఈ విధంగా చైతన్యపరిచారు.