Donald Trump: అమెరికాను షట్ డౌన్ చేసే ప్రసక్తే లేదు: యూఎస్ అధ్యక్షుడు ట్రంప్
- షట్ డౌన్ వల్ల అసలు కన్నా ఇతర సమస్యలు పెరుగుతాయి
- ప్రపంచంలోని నంబర్ వన్ ఆర్థిక వ్యవస్థ అమెరికా
- న్యూయార్క్, కాలిఫోర్నియా, వాషింగ్టన్, ఇల్లినాయిస్ లో క్వారంటైన్ చేద్దాం
ప్రపంచాన్ని కబళించి వేస్తున్న కరోనా వైరస్ జాబితాలో అగ్రరాజ్యం అమెరికా కూడా ఉన్న విషయం తెలిసిందే. అమెరికాలో ‘కరోనా’ బారినపడి ఇప్పటికే 550 మంది మరణించారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల రీత్యా అమెరికాలో షట్ డౌన్ చేయాలని అక్కడి వైద్యులు సూచించారు. అయితే, అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం అలా చేసే ప్రసక్తే లేదంటూ వైట్ హౌస్ లో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒకవేళ ఈ విషయాన్ని వైద్యులకే వదిలేస్తే షట్ డౌన్ చేయమంటారని, అలాగైతే, ప్రపంచ దేశాలు కూడా షట్ డౌన్ చేయాల్సి వస్తుందని విమర్శించారు. అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ‘కరోనా’ వ్యాపించలేదని, కొన్ని చోట్ల మాత్రమే నామమాత్రంగా ఉందని, కాకపోతే, న్యూయార్క్, కాలిఫోర్నియా, వాషింగ్టన్, ఇల్లినాయిస్ లో క్వారంటైన్ చేద్దామని చెప్పారు. ఈ రెండు వారాల్లో కొంత మేరకు మెరుగయ్యామని, అయితే, ఈ సమస్య ఇప్పటికిప్పుడే తగ్గిపోతుందని మాత్రం చెప్పనని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ‘కరోనా’ మృతుల సంఖ్య పెరగవచ్చని చెప్పారు.
షట్ డౌన్ చేయడం వల్ల అసలు సమస్య కన్నా ఇతర సమస్యలు పెరుగుతాయని, ప్రపంచంలోని నంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా ఉన్న అమెరికాను షట్ డౌన్ చేస్తే తీవ్ర ప్రభావం చూపుతుంది కనుక అలా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.