Olympics: కరోనా ఎఫెక్ట్... టోక్యో ఒలింపిక్స్ వాయిదా!
- ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా
- జపాన్ ప్రధానితో సమావేశమైన ఐఓసీ చీఫ్
- ఒలింపిక్స్ వాయిదాకు మొగ్గు
- ఒలింపిక్స్ వచ్చే ఏడాది జరిగే అవకాశం
ప్రపంచ దేశాలన్నీ కరోనాపై పోరాటంలో తలమునకలుగా ఉన్న నేపథ్యంలో జపాన్ లోని టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్ క్రీడలు వాయిదా వేయాలని నిర్ణయించారు. షెడ్యూల్ ప్రకారం ఒలింపిక్స్ జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరగాల్సి ఉంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున టోక్యో ఒలింపిక్స్ వాయిదా వేయాలని అనేక సభ్య దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) మాత్రం షెడ్యూల్ ప్రకారమే క్రీడలు నిర్వహించేందుకు పట్టుదల ప్రదర్శించింది.
అయితే అంతర్జాతీయంగా ఒత్తిళ్లు తీవ్రం కావడంతో జపాన్ ప్రధాని షింజే అబేతో ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్ సమావేశమయ్యారు. జపాన్ గడ్డపై జరగాల్సిన ఒలింపిక్స్ ను వాయిదా వేయడమే శ్రేయస్కరమని ఇరువురు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఒలింపిక్స్ వచ్చే ఏడాది నిర్వహించే అవకాశాలున్నాయి. కాగా, ఆధునిక ఒలింపిక్స్ చరిత్రను పరిశీలిస్తే 124 ఏళ్లలో ఒలింపిక్స్ వాయిదా పడడం ఇదే ప్రథమం.