Andhra Pradesh: సీఎం రిలీఫ్ పండ్‌కు ఎంపీ బాలశౌరి రూ.4 కోట్లు.. ఎంపీ నిధుల నుంచి కేటాయింపు
- కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భేష్
- వలంటరీ వ్యవస్థ ద్వారా నియంత్రణ చర్యలు అభినందనీయం
- మిగతా ఎంపీలు కూడా తమ ఎంపీ లాడ్స్ నిధులను ఖర్చు చేయాలి
కరోనా వైరస్ ఏపీలోనూ నెమ్మదిగా వేళ్లూనుకుంటుండడంతో నివారణకు ప్రభుత్వం నడుంబిగించింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సహాయక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఎంపీ నిధుల నుంచి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 4 కోట్లు కేటాయిస్తున్నట్టు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. కరోనా కట్టడికి జగన్ చేస్తున్న కృషిపై ప్రశంసలు కురిపించారు. వలంటీర్ వ్యవస్థ ద్వారా వైరస్ కట్టడికి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. సహచర ఎంపీలు కూడా తమ ఎంపీలాడ్స్ నిధుల నుంచి కొంత మొత్తాన్ని కరోనా నియంత్రణ కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తే రాష్ట్ర ఖజానాపై కొంత భారం తగ్గుతుందని ఆ లేఖలో బాలశౌరి అభిప్రాయపడ్డారు.