Prakash Javadekar: రూ. 2కి కిలో గోధుమలు, రూ. 3కి కిలో బియ్యం అందిస్తాం: కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్
- ప్రజలు సామాజిక దూరం పాటించాలి
- నిత్యావసరాలు అందుబాటులో ఉంటాయి.. ఆందోళన వద్దు
- ప్రజలందరూ క్రమశిక్షణతో వ్యవహరించాలి
దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, సామాజిక దూరాన్ని పాటించాలని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రజలను కోరారు. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడిస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. నిత్యావసరాలన్నీ అందుబాటులోనే ఉంటాయని, ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభయమిచ్చారు.
అభివృద్ధి చెందిన దేశాలపైనా కరోనా తీవ్ర ప్రభావం చూపించిందని అన్నారు. ప్రాణాంతక కరోనా వైరస్ వల్ల అనేక దేశాల్లో మరణాలు సంభవించాయని అన్నారు. దేశంలో కరోనా వైరస్ కట్టడికి కేంద్రం అన్ని రకాల చర్యలు చేపట్టిందని మంత్రి పేర్కొన్నారు. ప్రజలందరూ క్రమశిక్షణతో వ్యవహరించాలని కోరారు. కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని ఆయా సంస్థలు, కంపెనీలను కోరారు. పాలు, నిత్యావసర సరుకుల దుకాణాలు నిర్ణీత సమయంపాటు తెరిచే ఉంటాయని అన్నారు. రెండు రూపాయలకే కిలో గోధుమలు, మూడు రూపాయలకే కిలో బియ్యం అందిస్తామని జవదేకర్ తెలిపారు.