Corona Virus: విరాళాలు ప్రకటిస్తున్న సినీ ప్రముఖులు.. ఇంటిని ఆసుపత్రిగా మార్చేస్తానన్న కమల హాసన్
- సినీ కళాకారులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన తమిళ సినీ ప్రముఖులు
- రజనీకాంత్, ధనుష్, కమల్, కార్తీ, విజయ్ సేతుపతి తదితరుల విరాళాల ప్రకటన
- 100 బస్తాల బియ్యం వితరణ ఇచ్చిన దర్శకుడు హరి
కరోనా వైరస్‌తో బాధపడుతున్న వారికి చికిత్స అందించేందుకు తన ఇంటిని ఆసుపత్రిగా మార్చాలనుకుంటున్నట్టు ప్రముఖ నటుడు కమలహాసన్ ప్రకటించారు. తన పార్టీ (మక్కల్ నీది మయ్యం) వైద్యులతో కలిసి తన ఇంటిని ఆసుపత్రిగా మార్చాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో పేదలకు సేవలు అందించేందుకు ఇదే మార్గమని భావిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే తన ఇంటిని ఆసుపత్రిగా మార్చేస్తానని పేర్కొన్నారు.
మరోవైపు, షూటింగులు నిలిచిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ పరిశ్రమలోని పేద కళాకారులను ఆదుకునేందుకు కమల్ రూ. 10 లక్షలు విరాళం ప్రకటించగా, ధనుష్ రూ. 15 లక్షలు, శంకర్ రూ. 10 లక్షలు విరాళం ప్రకటించారు. కాగా, సూర్య, కార్తి, శివకుమార్ కలిసి ఇప్పటికే రూ. 10 లక్షలు ప్రకటించగా, రజనీకాంత్ రూ. 50 లక్షలు, విజయ్ సేతుపతి రూ. 10 లక్షలు, శివకార్తికేయన్ రూ. 10 లక్షలు, దర్శకుడు హరి 100 బస్తాల బియ్యం, నిర్మాత ఢిల్లీబాబు 20 బస్తాల బియ్యం చొప్పున విరాళంగా అందించారు. నటుడు మనీష్ కాంత్ 40 కిలోల పప్పుదినుసులు, తమిళ సినిమా జర్నలిస్టు డైలీస్ అసోసియేషన్ తరపున 100 కిలోల బియ్యం చొప్పున అందజేశారు.