Telangana: కరోనా ప్రభావం ఎప్పటివరకూ?... తెలంగాణ అధికార పంచాంగ పఠనంలో చెప్పిందిదే!
- మే 22 వరకూ వైరస్ ప్రభావం
- ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందే
- కొత్త ఏడాదిలో ఆర్థిక ఒడిదుడుకులు
- అందరినీ మెప్పించనున్న కేసీఆర్
- పంచాంగకర్త సంతోష్ కుమార్
నిన్న తెలంగాణ రాష్ట్ర ఉగాది వేడుకలు హైదరాబాదులోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో నిరాడంబరంగా సాగగా, సంతోష్ కుమార్ పంచాంగ పఠనం చేశారు. 'వికారి నామ సంవత్సరం వెళుతూ వెళుతూ శార్వరీకి కరోనా వైరస్ ను అందించింది. ఈ సంవత్సరంలో ఆరుసార్లు కాలసర్పయోగం కలుగుతుంది. దీని వల్ల విపత్తులు, ప్రజలకు అవస్థలు తప్పవని పంచాంగకర్త వెల్లడించారు.
కరోనా ప్రభావంపై మాట్లాడిన ఆయన, మే 22 వరకూ ప్రజలు జాగ్రత్తగా ఉండక తప్పదని అన్నారు. చండీయాగాలు, హోమాలు, వేద పారాయణాలు చేయడం ద్వారా వైరస్ బారి నుంచి బయటపడటానికి అవకాశాలు పెరుగుతాయని, ప్రజలు స్వీయ నియంత్రణలోనే ఉండాలని సూచించారు. మే తరువాత వైరస్ వ్యాప్తి తగ్గుతుందని జోస్యం చెప్పారు. కొత్త ఏడాది ఆర్థిక ఒడిదుడుకులను తేనుందని, విద్యా శాఖలో కుంభకోణాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.
ఇక కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని, అన్ని రంగాల్లోనూ ముందుకు వెళుతుందని తన పరిపాలనా దక్షతతో ఆయన ప్రతి ఒక్కరినీ మెప్పిస్తారని అన్నారు. కేసీఆర్ ది కర్కాటక రాశి అని గుర్తు చేసిన సంతోష్ కుమార్, వ్యక్తిగతంగా శార్వరీ నామ సంవత్సరం ఆయనకు శుభప్రదమని అన్నారు.
జూన్, జూలై నెలల్లో భూ కంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఆపై ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షాలు కురిసి వరదలకు అవకాశం ఉందని ఆయన తెలిపారు. పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయని, ఆర్థిక మోసాలు కూడా జరుగుతాయని అన్నారు.