Corona Virus: కరోనా గురించి భయం వద్దు... ఈ నిజాలు తెలుసుకుంటే ఆందోళన ఉండదు!
- రోజురోజుకూ తగ్గుతున్న మరణాలు
- క్రమంగా పెరుగుతున్న రికవరీల సంఖ్య
- కరోనా వ్యాప్తి కట్టడికి నిధుల వెల్లువ
- వైరస్ కు మందును కనుగొనడంలో పలు దేశాల ముందడుగు
కరోనా వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇది నిజమే. అయితే, భయాందోళనలు చెందాల్సిన అవసరం ప్రస్తుతం కనిపించడం లేదు. ఏదో జరిగిపోతుందన్న అనుమానాల కన్నా, ఈ వైరస్ ను ఎదిరించగలమన్న నమ్మకం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. కరోనాపై పోరాటంలో, ప్రపంచంలో జరిగిన, జరుగుతున్న కొన్ని విషయాల గురించి తెలుసుకుంటే, వైరస్ వ్యాప్తిపై ఉన్న భయాలు తొలగిపోయాయి.
ఈ వైరస్ సుమారు 4.38 లక్షల మందికి సోకగా, సుమారు 19 వేల మంది మరణించారు. అంటే మరణాల సంఖ్య సుమారు 4 శాతమే. అంటే, వైరస్ సోకిన వారంతా మరణిస్తారని భావించాల్సిన అవసరం లేదు. కరోనా సోకిన వారిలో ఇప్పటికే లక్ష మందికి పైగా కోలుకున్నారు. మరింత మందికి నెగటివ్ వచ్చినా, ముందు జాగ్రత్తగా క్వారంటైన్ లో ఉన్నారు.
భారత దేశ రాజధాని ఢిల్లీలో గడచిన 24 గంటల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఢిల్లీలో ఇంతవరకూ 30 కేసులు పాజిటివ్ రాగా, అందులో ఐదుగురు కోలుకున్నారు. బుధవారం నాటికి ఇండియాలోని కరోనా పాజిటివ్ కేసుల్లో 42 మంది డిశ్చార్జ్ అయ్యారు కూడా. ఇక కరోనా విలయతాండవం చేస్తున్న ఇటలీలో మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. శనివారం నాడు 793 మంది ప్రాణాలు కోల్పోగా, ఆ సంఖ్య ఆదివారం 651కి, సోమవారం 601కి తగ్గింది.
ఇక కరోనాకు ఇంతవరకూ మందు లేకపోయినా, ఆ దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. మలేరియాకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధం కరోనాపై ప్రభావం చూపుతోంది. ఈ మందును వాడవచ్చని ఐసీఎంఆర్ సైతం పేర్కొంది. ఇండియా కేంద్రంగా వాక్సిన్ల తయారీ సంస్థ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది. త్వరలోనే మానవులపైనా ప్రయోగాలకు తాము సిద్ధమని సంస్థ సీఈఓ పూనావాలా వెల్లడించారు. తాము ఇప్పటికే వైరస్ కు మందును కనుగొనే దిశగా ముందడుగు వేశామని అమెరికా ప్రకటించింది.
వైరస్ వ్యాప్తిని అరికట్టే దిశగా ప్రభుత్వం ఇప్పటికే ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యాన్ని కోరింది. పది ప్రైవేటు ల్యాబ్ లకు టెస్టింగ్ అనుమతులు ఇచ్చింది. శానిటైజర్లు, మాస్కుల ధరలు పెరగకుండా చేసింది. ఈ విపత్కర పరిస్థితుల్లో నిధులకు సమస్య రాకుండా పలు కార్పొరేట్ సంస్థలు, హై నెట్ వర్త్ ఇన్డివిడ్యువల్స్, రాజకీయ నాయకులు తమవంతు సాయం చేస్తున్నారు.
మాస్క్ ల ఉత్పత్తిని రోజుకు లక్షకు పెంచినట్టు రిలయన్స్ వెల్లడించింది. రక్షణాత్మక సూట్ లను కూడా తయారు చేస్తున్నామని పేర్కొంది. ఎమర్జెన్సీ వాహనాలకు ఉచిత ఇంధనాన్ని ఇస్తోంది. స్వచ్ఛంద సంస్థల సహకారంతో పలు నగరాల్లో ఉచిత భోజన సదుపాయాన్ని దగ్గర చేసింది.
ఇక ప్రజలు చేయాల్సింది ఒక్కటే. అదే సామాజిక దూరం. ఇదే కరోనా కట్టడికి ఔషధం. కాబట్టి, కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేసి, సమర్థవంతంగా పనిచేస్తే, కరోనా మహమ్మారిని తరిమేయడం పెద్ద కష్టమేమీ కాబోదు.