Milk: పోలీసుల అత్యుత్సాహం... 15 వేల లీటర్ల పాలు, 10 టన్నుల కూరగాయలు వృథా!

Milk and Vegetables waste in New Delhi

  • డెలివరీ బాయ్స్ పై పోలీసుల దాడులు
  • తాజా పాలు అందించలేమన్న మిల్క్ బాస్కెట్
  • ఈ-పాస్ లను జారీ చేస్తామన్న అరవింద్ కేజ్రీవాల్

ఓ వైపు కరోనా వ్యాప్తి భయం, మరో వైపు దేశవ్యాప్త లాక్ డౌన్. ఎవరూ బయట తిరగవద్దని ఉత్తర్వులు, ప్రజల కదలికలపై ఆంక్షలు. ఇదే సమయంలో నిత్యావసర వస్తువుల రవాణాకు ఎటువంటి ఆంక్షలూ ఉండబోవన్న భరోసానూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చాయి. అయితే, కొందరు పోలీసుల అత్యుత్సాహం వల్ల న్యూఢిల్లీలో 15 వేల లీటర్ల పాలు, 10 వేల కిలోల కూరగాయలు వృథా అయ్యాయి.

నిత్యావసరాల పంపిణీకి ఆటంకాలు ఉండవని ప్రభుత్వం చెప్పినా, పోలీసులు పట్టించుకోవడం లేదని, తాము వేధింపులను ఎదుర్కొంటున్నామని ఈ-కామర్స్ కంపెనీలు వాపోయాయి. పాలు, కూరగాయలు, ఆహారం, ఔషధాలను కూడా డెలివరీ చేయనివ్వడం లేదని, తమ బాయ్స్ పై దాడులు చేశారని, వెంటనే ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోవాలని బిగ్ బాస్కెట్ ఫ్రెష్ మెనూ, ఫోర్టియా మెడికల్ వంటి ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ సంస్థలు డిమాండ్ చేశాయి. వెంటనే కల్పించుకోకుంటే తమ కార్యకలాపాలు నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆన్ లైన్ ప్లాట్ ఫాంల ప్రమోషర్ గణేశ్ హెచ్చరించారు.

పోలీసులు తమ డెలివరీ బాయ్ లను కొడుతున్నారని, ఏజెంట్లను అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. విపత్కర పరిస్థితుల్లో ఉన్న ప్రజలకు సాయం చేయాలని చూస్తుంటే, తాము కష్టాల పాలవుతున్నామని ఆయన అన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి, ప్రజలకు ఆహారాదులను అందిస్తున్న వారిని కొట్టవద్దని విజ్ఞప్తి చేశారు.

ఈ పరిస్థితుల్లో తాజా పాలను అందించే అవకాశాలు కనిపించడం లేదని నోయిడా, గురుగ్రామ్, హైదరాబాద్ వంటి నగరాల్లో పాలను సరఫరా చేస్తున్న ఫ్రెష్ హోమ్ పేర్కొంది. తెచ్చిన పాలను పారబోయాల్సి వచ్చిందని మిల్క్ బాస్కెట్ వాపోయింది.

కాగా, కేరళలో రోగికి సేవ చేసేందుకు వెళుతున్న ఆరోగ్య కార్తకర్త ఒకరిని పోలీసులు అరెస్ట్ చేయడంపై కెప్టెన్ గ్రబ్ వ్యవస్థాపకుడు కరణ్ నంబియార్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఉన్నా, అది కాగితాలకే పరిమితమైందని అన్నారు.

ఇదిలావుండగా, గుర్తింపు కార్డులున్న హోమ్ డెలివరీ బాయ్ లను అడ్డుకోవద్దని నీతి ఆయోగ్ సీఈఓ పోలీసులను కోరారు. ఈ మేరకు సంబంధిత ఉన్నతాధికారులకు ఆదేశాలను పంపినట్టు తెలిపారు. కూరగాయల అమ్మకం దారులకు, కిరాణా వ్యాపారులకు ఈ-పాస్ లను జారీ చేస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News