crowdfunding: కరోనాతో ఉపాధి కోల్పోయిన వారి కోసం క్రౌడ్ ఫండింగ్
- ఇబ్బంది పడుతున్న దినసరి కూలీలు, చిరు వ్యాపారులు
- ఆదుకునేందుకు ముందుకొచ్చిన క్రౌడ్ ఫండింగ్ సంస్థ మిలాప్
- ఆన్‌లైన్ ద్వారా విరాళాల సేకరణ
కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించారు. కూరగాయలు, నిత్యావసర సరుకులు, మెడికల్, ఇతర అత్యవసర సేవలను మాత్రమే అనుమతించారు. దాంతో, అనేక రంగాల వ్యాపారాలు మూతపడ్డాయి. దీనివల్ల దినసరి వేతన జీవులు, చిరు వ్యాపారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పని లేక, వ్యాపారాలు లేక వాళ్లంతా తమ కుటుంబాలను పోషించలేకపోతున్నారు. వారంతా తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అలాంటి వారిని ఆదుకునేందుకు ప్రముఖ క్రౌడ్ ఫండింగ్ సంస్థ ముందుకొచ్చింది.
క్రౌడ్ ఫండింగ్ ద్వారా విరాళాలు సేకరించి రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. ఇందుకు ప్రత్యేక ఆన్‌లైన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు సంస్థ హైదరాబాద్ ప్రతినిధులు తెలిపారు. సాయం చేయదలిచినవాళ్లు ఆన్‌లైన్‌లో milaap.org/covid19 పేజీని ఓపెన్ చేసి విరాళాలు ఇవ్వొచ్చని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన నిధులను అవసరార్థుల కోసం, చిన్న ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారికి కూడా ఉపయోగిస్తామని తెలిపారు.