Jagan: ఎలాంటి సమస్యలైనా 1902కి ఫోన్ చేయండి... ఆరోగ్య సమస్యలుంటే 104కి కాల్ చేయండి: సీఎం జగన్
- ఎక్కడివాళ్లు అక్కడే ఉండాలని సీఎం జగన్ విజ్ఞప్తి
- ఐఏఎస్ అధికారి కృష్ణబాబు ఆధ్వర్యంలో హెల్ప్ లైన్ పర్యవేక్షణ
- ప్రత్యేకంగా 450 ఐసీయూ బెడ్లతో నాలుగు కరోనా ఆసుపత్రులు
కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై ఏపీ సీఎం జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలని, స్థల మార్పిడి వల్ల కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో తీవ్ర గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా 1902కి ఫోన్ చేయాలని, ఆరోగ్య సమస్యలు ఉంటే 104కి సమాచారం అందించాలని సూచించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి కృష్ణబాబు ఆధ్వర్యంలో 10 మంది ఐఏఎస్ అధికారుల బృందం 1902 హెల్ప్ లైన్ ను పర్యవేక్షిస్తుందని, మంత్రులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తారని తెలిపారు.
ఏ గ్రామంలో ఉండేవాళ్లు ఆ గ్రామంలోనే ఉండాలని, ఏ జిల్లాలో ఉండేవాళ్లు ఆ జిల్లాలోనే ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో ప్రత్యేకంగా కరోనా ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నామని, ఒక్కో ఆసుపత్రిలో 450 ఐసీయూ బెడ్లు ఉంటాయని తెలిపారు. క్వారంటైన్ కోసం ప్రతి జిల్లాలో 200 ఐసోలేషన్ బెడ్లు, ప్రతి నియోజకవర్గంలో 100 బెడ్లతో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. జలుబు, జ్వరం, దగ్గు వంటి కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే వలంటీర్ కు సమాచారం అందిస్తే చాలని, అక్కడి నుంచి ప్రభుత్వమే చూసుకుంటుందని అన్నారు.