Corona Virus: వలస కార్మికులకు కూడు, గూడు కల్పించండి: రాష్ట్రాలకు కేంద్రం సూచన
- లాక్‌డౌన్‌లోనూ విజృంభిస్తున్న కరోనా
- నిన్న ఒక్క రోజే ఏడుగురి మృతి
- మొత్తం బాధితులు 721 మంది
కరోనా వైరస్ కట్టడి కోసం 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించడంతో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు అండగా నిలవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది. అలాంటి వారికి ఆహారంతో పాటు వసతి ఏర్పాటు చేయాలని సూచించింది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఎక్కడివారు అక్కడే ఉండాలని కేంద్రం సూచించింది. విద్యార్థులు తమ హాస్టళ్లలోనే కొనసాగాలని చెప్పింది.
ప్రాణాంతక వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పరిస్థితి ఇంకా అదుపులోకి రావడం లేదు. ఈ వైరస్ బారిన పడ్డ వారిలో గురువారం దేశ వ్యాప్తంగా ఏడుగురు చనిపోయారు. ఒకే రోజులో ఇంత మంది బాధితులు చనిపోవడం ఇదే అత్యధికం కావడం గమనార్హం. మొత్తంగా కరోనా మరణాల సంఖ్య 20కి చేరగా.. కొత్తగా 71 కేసులు నమోదయ్యాయి. నిన్నటి వరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 721కి చేరింది.