venezuela: వెనిజులా అధ్యక్షుడిపై అమెరికా తీవ్ర అభియోగాలు.. ఆయన తలపై 15 మిలియన్ డాలర్ల రివార్డు
- అధ్యక్షుడు మాడ్యురో, ఆయన అధికారులపై అమెరికా తీవ్ర అభియోగాలు
- రుజువైతే గరిష్టంగా జీవిత ఖైదు
- అమెరికాపై మండిపడిన వెనిజులా
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాడ్యురో అరెస్టుకు తోడ్పడే సమాచారం అందించిన వారికి 15 మిలియన్ డాలర్లు ఇస్తామని అమెరికా ప్రకటించింది. మాదకద్రవ్యాలను తమ దేశంలోకి అక్రమంగా రవాణా చేస్తున్నారంటూ మాడ్యురో సహా ఆయన ప్రభుత్వంలోని ఇతర అధికారులపైనా అమెరికా అభియోగాలు మోపింది. ఈ నేపథ్యంలోనే ఈ రివార్డు ప్రకటించినట్టు అమెరికా అటార్నీ జనరల్ విలియమ్ బార్ తెలిపారు. మాడ్యురో ప్రభుత్వంలోని అధికారుల తలకూ 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. వెనిజులా ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో చిక్కుకుందని ఆయన ఆరోపించారు. దానిని తుడిచిపెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
మాడ్యురో, ఆయన ప్రభుత్వంలోని అధికారులపై డ్రగ్ ట్రాఫికింగ్, నార్కో టెర్రరిజం కింద అమెరికా అభియోగాలు మోపింది. ఈ అభియోగాలు రుజువైతే 50 ఏళ్ల నుంచి జీవితకాలం శిక్ష పడే అవకాశం ఉంది. అయితే, అమెరికా ఆరోపణలను వెనిజులా విదేశాంగ మంత్రి జార్జి అరియాజా తీవ్రంగా ఖండించారు. డ్రగ్ ట్రాఫికింగ్‌కు వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరును తక్కువ చేసి చూపేందుకే అమెరికా ఇలాంటి వికృత పంథాను ఎంచుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనిజులా ప్రభుత్వాన్ని కూల్చేందుకు ట్రంప్ సర్కారు చేస్తున్న ప్రయత్నాలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఫలించవని ఆయన తేల్చి చెప్పారు.