punjab: అత్యవసర స్థితితో అర్ధాంగి ప్రాణాల కోసం ఓ భర్త సాహసం
- ప్రమాదంలో గాయపడిన భార్యకు ఓ ఆసుపత్రిలో చికిత్స
- పరిస్థితి ప్రమాదకరంగా ఉందని మరో ఆసుపత్రికి తరలించమన్న వైద్యులు
- రవాణా సౌకర్యంలేక 12 కిలోమీటర్లు సైకిల్ పై తీసుకువెళ్లిన భర్త
నీ కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటానంటూ భార్య మెడలో మూడుముళ్లు వేసిన అతను కష్టకాలంలో తన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించాడు. ప్రమాదకర స్థితిలో ఉన్న భార్యను పన్నెండు కిలోమీటర్ల దూరంలోని ఆసుపత్రికి సైకిల్ పై చేర్చి ఆమె ప్రాణాలు కాపాడుకున్నాడో భర్త. పంజాబ్ లోని లూథియానాలో వెలుగు చూసిన ఈ ఘటన పూర్వాపరాలు ఇలావున్నాయి. దేవదత్ రామ్ దంపతులు లూథియానాలో నివాసం ఉంటున్నారు. భర్త వేరే పనులు చేస్తుండగా, స్థానికంగా ఉన్న ఓ ఫ్యాక్టరీలో భార్య పనిచేస్తోంది.
ఈ నెల 20వ తేదీన కర్మాగారంలో ప్రమాదం జరిగి దేవదత్ రామ్ భార్య తీవ్రంగా గాయపడింది. వెంటనే తోటి కార్మికులు ఆమెను భరత్ నగర్ లోని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతుండగా ఆమె పరిస్థితి విషమించింది. దీంతో మెరుగైన వైద్యం కోసం కంగన్వాల్ లోని మరో ఆసుపత్రికి తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో ప్రైవేటు వాహనం కోసం దేవదత్ ప్రయత్నించాడు.
కానీ లాక్ డౌన్ కారణంగా ఎవరూ రావడానికి ఇష్టపడలేదు. అంబులెన్స్ వాళ్లను అడిగితే 12 కిలోమీటర్ల దూరంలోని ఆసుపత్రికి చేర్చేందుకు రూ.2 వేలు డిమాండ్ చేశారు. అంత డబ్బు చెల్లించే స్తోమత లేకపోవడంతో వేరేదారిలేక దేవదత్ తన సైకిల్ పై ఆమెను కూర్చోబెట్టుకుని అంత దూరంలోని ఆసుపత్రికి తీసుకుని వెళ్లాడు.