Donald Trump: కరోనాపై జిన్ పింగ్ తో మాట్లాడాలని నిర్ణయించుకున్న ట్రంప్!
- కరోనా కేసుల విషయంలో చైనాను మించిన అమెరికా
- నేటి రాత్రి 9 గంటలకు జిన్ పింగ్ తో చర్చలు
- స్వయంగా వెల్లడించిన డొనాల్డ్ ట్రంప్
కరోనా మహమ్మారి వెలుగుచూసిన చైనాతో పోలిస్తే, అమెరికాలో కేసుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో చర్చించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడిన వారి సంఖ్య 85 వేలు దాటగా, 1300 మందికి పైగా మరణించారు.
ఈ నేపథ్యంలో జిన్ పింగ్ తో చర్చలు జరుపనున్నట్లు గురువారం ట్రంప్ స్వయంగా వెల్లడించారు. నేటి రాత్రి 9 గంటలకు జిన్ పింగ్ కు తాను ఫోన్ చేయనున్నానని మీడియాకు తెలిపారు. చైనాలోని వుహాన్ లో పుట్టిన ఈ వైరస్ ను తక్కువ సమయంలోనే చైనా కట్టడి చేయగా, ఇటలీ, స్పెయిన్, అమెరికా, ఇరాన్ తదితర దేశాలు మాత్రం రెండో దశలోనే ఆపలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.
ఇక, కరోనాపై అమెరికా, చైనాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నప్పటికీ, చైనాతో తమకు సత్సంబంధాలే ఉన్నాయని, వైరస్ వ్యాప్తి, నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై జిన్ పింగ్ తో తాను మాట్లాడతానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఓ వాణిజ్య ఒప్పందం గురించి కూడా ఇరు దేశాధినేతల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.