Vijayawada: సీపీఎం దాతృత్వం... 20 వేల మందికి భోజన వితరణ
- లాక్‌డౌన్‌తో పస్తులుంటున్న పేదలు, కూలీలు
- విజయవాడ సింగనగర్ ప్రాంతంలో బాధితులు
- ఇళ్లకు వెళ్లి భోజనం అందించిన నేతలు, కార్యకర్తలు
కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడంతో నిరుపేదలు, కూలీలకు ఇబ్బంది తప్పడం లేదు. పనుల్లేక, సంపాదనలేక చాలామంది ఆకలితో అలమటిస్తున్నారు. అర్ధాకలితో గడుపుతున్నవారు కొందరైతే, పస్తులుంటున్న వారు మరికొందరు. విజయవాడలోనే ఇలాంటి వారు వందల సంఖ్యలో ఉండడం గుర్తించిన సీపీఎం పార్టీ నేతలు, కార్యకర్తలు ఈరోజు సింగ్ నగర్ ప్రాంతంలో భోజన ప్యాకెట్లు అందజేశారు. మొత్తం ఎనిమిది డివిజన్లలోని 20 వేల మందికి ఆహార సదుపాయం కల్పించి పేదలు, కూలీల ఆకలి తీర్చారు.
ఈ సందర్భంగా పలువురు సీపీఎం నేతలు మాట్లాడుతూ ప్రజల బాధ్యతను గుర్తు చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలు, కూలీలపట్ల తమ బాధ్యతను విస్మరించారని విమర్శించారు. రోజు కూలీపై ఆధారపడే వారు నానా పాట్లు పడుతున్నారని, వారికి వలంటీర్ల ద్వారా భోజన సదుపాయం కల్పించాలన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఐదు కేజీల బియ్యం, వెయ్యి రూపాయలు ఎలా సరిపోతాయని ప్రశ్నించారు.