YV Subba Reddy: ఇల్లే శ్రీరామ రక్ష.. ఏప్రిల్ 14 వరకు బయటకు రావద్దు: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

TTD chairman YV Subbareddy says Do not come outside till April 14th

  • మోదీ, జగన్ ల పిలుపునకు కట్టుబడి ఉందాం
  • ఏపీ, తెలంగాణలో ఎవరికే కష్టమొచ్చినా ఆదుకునేందుకు ప్రభుత్వాలు సిద్ధం
  • తిరుమలలో ధన్వంతరి యాగం రేపటి వరకు కొనసాగుతుంది

నేడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ బారి నుంచి ఉపశమనం పొందాలంటే ఏప్రిల్ 14 వరకు ప్రతి ఒక్కరూ గడప దాటి బయటకు రావద్దని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపునకు కట్టుబడి, వారి మార్గదర్శకాలతో ‘కరోనా’ను తరిమికొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడనే ఉంటే ఈ వైరస్ ప్రభావాన్ని పూర్తిగా నిరోధించడానికి తోడ్పడిన వాళ్లవుతారని అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి ఏ కష్టమొచ్చినా ఆదుకోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని, రాష్ట్రంలోని వార్డు, గ్రామ వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ల బాగోగులు తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిస్తూ తగిన సహాయ సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

మూడు వారాల స్వీయ నిర్బంధంలో ఎవరికి ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా, ఆహారం అందుబాటులో లేకున్నా 1902, 104 నంబర్లకు కాల్ చేసిన వెంటనే ప్రభుత్వ సిబ్బంది వస్తారని, కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారని సూచించారు.

కరోనా వైరస్ ను అణచి వేసేందుకు తిరుమలలో నిన్నటి నుంచి ప్రారంభమైన ధన్వంతరి యాగం రేపటి వరకు కొనసాగుతుందని  తెలిపారు. ఏడు లోకాల అధిపతుల ఆవాహనతో శ్రీ విష్ణు మంత్రోచ్చారణల మధ్య ఈ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శాంతి, ధన్వంతరి కలశాలను స్థాపించి మంత్రోచ్చారణల అనంతరం ఆ కలశాల జలాన్ని ఆగమ శాస్త్ర పండితులు ఆకాశంలో సంప్రోక్షణ చేస్తారని వివరించారు. యాగ ఫలాలు భక్తులందరికి చేరి ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News