Narendra Modi: "కరోనాను గెలిపించవద్దు నాన్నా" అంటూ తండ్రికి లేఖ రాసిన చిన్నారి... ఈ వీడియో చూడండన్న మోదీ
- సోషల్ మీడియాలో చిన్నారి లేఖ వీడియో వైరల్
- ఈ వీడియో స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అందుకోవాలన్న మోదీ
- ఇంట్లో ఉండేందుకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచన
తాజాగా సోషల్ మీడియాలో ఓ చిన్నారికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షేర్ చేయడంతో దానిపై మరింత ఆసక్తి ఏర్పడింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే, కరోనా నేపథ్యంలో ఓ చిన్నారి తన తండ్రికి లేఖ రాయడాన్ని చూపించారు. ఆ చిన్నారి, తన తల్లితో కలిసి మరో ప్రాంతంలో ఉండగా, లాక్ డౌన్ కారణంగా ఆ చిన్నారి తండ్రి ముంబయిలో ఉండిపోతాడు. అప్పుడా బాలిక తన తండ్రిని ఉద్దేశించి ఇలా రాస్తుంది...
"నాన్నా మేం నిన్ను ఏమాత్రం మిస్ కావడంలేదు. మాకోసం నువ్వు బయటికి రావొద్దు. బయటికి వచ్చావంటే కరోనా గెలుస్తుంది. మనం కరోనాను ఓడించాలి. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి" అంటూ తండ్రికి సందేశం అందించినట్టు వీడియోలో చూపించారు. ఇది లాక్ డౌన్ స్ఫూర్తిని చాటే వీడియో అని, ఈ వీడియోలో చూపిన విధంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండేందుకే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని మోదీ సూచించారు.