America: అమెరికాలో కరోనా వైరస్ విధ్వంసం.. లక్ష దాటిన కోవిడ్ కేసుల సంఖ్య

America coronavirus cases reaches over one lakh

  • అమెరికాను కుదిపేస్తున్న కరోనా వైరస్
  • కేసుల నమోదులో చైనా, ఇటలీలను దాటేసిన వైనం
  • ఇప్పటి వరకు 1588 మంది మృతి

అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. అక్కడ కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య నిన్నటికి లక్ష (1,01,000) దాటేసింది. వారం రోజుల క్రితం ఈ సంఖ్య 8 వేలే కావడం గమనార్హం. గురువారం ఒక్క రోజే అమెరికాలో ఏకంగా 16,877 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే, ఈ ప్రాణాంతక వైరస్ బారినపడి ఇప్పటి వరకు 1588 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్క రోజే 402 మంది మృతి చెందారు. అమెరికాలో రెండు నెలల క్రితం తొలి కరోనా కేసు నమోదైంది. ఆ తర్వాత ఈ వైరస్ శరవేగంగా విస్తరించి ఇప్పుడు కరోనా బాధిత దేశంగా మారిపోయింది.

కరోనా కేసుల్లో చైనా, ఇటలీలను అమెరికా దాటేసింది. న్యూయార్క్, వాషింగ్టన్‌లలో వైరస్ తీవ్రత మరింత అధికంగా ఉంది. చికాగో, డెట్రాయిట్, న్యూ ఓర్లీన్స్‌లలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తమ వద్ద తగినంత వైద్య వనరులు లేవని దేశవ్యాప్తంగా 213 నగరాల మేయర్లు చేతులెత్తేశారు. బాధితులను రక్షించేందుకు అవసరమైన పరికరాలను పొందే మార్గం కానీ, సరఫరా కానీ లేదని పేర్కొన్నట్టు శుక్రవారం విడుదలైన ఓ సర్వే వెల్లడించింది. న్యూ ఓర్లీన్స్‌లోని మూడు కరోనా పరీక్ష కేంద్రాల వద్ద  అనుమానితులు పెద్ద ఎత్తున బారులు తీరారు.

మిచిగన్‌లో వారం క్రితం 350గా ఉన్న కేసుల సంఖ్య ప్రస్తుతం 3 వేలకు పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. 468 మంది పోలీసులు అధికారులు క్వారంటైన్‌లో ఉన్నట్టు డెట్రాయిట్ మేయర్ మైక్ డగ్గన్ తెలిపారు. పోలీస్ చీఫ్ సహా 39 మంది పోలీసులు అధికారులకు కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలింది.

  • Loading...

More Telugu News