Kamal Haasan: కమలహాసన్ కు 'కరోనా' సోకిందంటూ వార్తలు.. ఖండించి, వివరణ ఇచ్చిన కమల్!

kamalhaasan  clarification about chennai corporations quarantine notice

  • నిజాలు తెలుసుకుని వార్తలు రాయాలని హెచ్చరిక
  • క్వారంటైన్‌ స్టిక్కర్‌ అంటించిన ఇంట్లో తాను ఉండట్లేదని వివరణ
  • కొన్నేళ్ల క్రితమే ఆ ఇల్లు ఖాళీ చేశానని వివరణ

సినీ నటుడు కమలహాసన్‌ను అధికారులు హోమ్‌ క్వారంటైన్‌లో ఉంచారని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఇందుకు బలమైన కారణమే ఉంది. ఇటీవల తమిళనాడులోని ఆళ్వారుపేటలో ఆయన ఇంటికి అధికారులు ఓ స్టిక్కర్‌ అంటించి, ఆ ఇంట్లోని వారు క్వారంటైన్‌లో ఉంటున్నారని రాశారు.

ఆ ప్రాంతంలో చాలా మంది ఇళ్లకు ఇటువంటి స్టిక్కర్లు అంటిస్తూ, వైద్య సిబ్బంది తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే కమల్‌ ఇంటికి కూడా అంటించారు. అది కూడా పొరపాటుగానే కమల్‌ ఇంటికి ఆ స్టిక్కర్‌ అంటించామని తాజాగా గ్రేటర్ చెన్నై కార్పొరేషన్‌ ప్రకటన చేసింది. అయినప్పటికీ, కమల్‌పై ప్రచారం ఆగట్లేదు.

కమల్‌కు కరోనా వైరస్‌ సోకిందంటూ కూడా వార్తలు రావడం గమనార్హం. దీంతో స్పందించిన కమలహాసన్‌ వార్తలు రాసేముందు నిజమేంటో తెలుసుకోవాలని హెచ్చరించారు. అసత్య వార్తలు ప్రచారం కాకుండా న్యూస్‌ ఏజెన్సీలు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
 
తాను గృహ నిర్బంధంలో ఉంటున్నానని వస్తోన్న ప్రచారంలో నిజం లేదని కమల్ ప్రకటన చేశారు. స్టిక్కర్‌ అంటించిన ఇంట్లో తాను చాలా ఏళ్లుగా ఉండట్లేదన్న విషయం చాలా మందికి తెలుసని చెప్పారు. మక్కల్ నీది మయ్యం కార్యకలాపాలు అక్కడి నుంచి జరుగుతున్నాయని తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే తాను ముందు జాగ్రత్తగా ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని కోరానని వివరించారు. అలాగే, తాను కూడా ఈ నియమాన్ని పాటిస్తున్నానని చెప్పారు.                         

  • Loading...

More Telugu News