Pakistan: కరోనా తగ్గిందని పార్టీ ఇచ్చి.. మళ్లీ దానికే దొరికిపోయాడు!
- పాకిస్థాన్ లోను విస్తరిస్తున్న కరోనా
- ఒకసారి క్వారంటైన్ కి వెళ్లొచ్చిన వ్యక్తి
- మళ్లీ చికిత్సను అందిస్తున్న వైద్యులు
ప్రపంచంలోని పలు దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఊహించనంత వేగంగా విస్తరిస్తూ ప్రజలను భయపెట్టేస్తోంది. అయితే ఆయా ప్రాంతాల్లో ఈ వైరస్ ను తేలికగా తీసుకుంటున్నవారు కూడా లేకపోలేదు. అలా కరోనాను లైట్ తీసుకున్న ఒక వ్యక్తి, రెండవసారి దాని బారినపడిన ఉదంతం పాకిస్థాన్ లో వెలుగులోకి వచ్చింది.
అక్కడ 'రావల్పిండి'కి చెందిన ఒక వ్యక్తికి రెండు వారాల క్రిందట కరోనా సోకింది. వైద్యులు అతన్ని క్వారంటైన్ లో ఉంచి చికిత్సను అందించారు. ఆ తరువాత టెస్టు చేసిన వైద్యులు .. రిపోర్ట్స్ లో నెగిటివ్ రావడంతో అతణ్ణి ఇంటికి పంపించి వేశారు. కరోనా తగ్గిందనే ఆనందంతో అతను తన బంధుమిత్రులలో ఒక 100మందిని ఆహ్వానించి పెద్ద పార్టీ ఇచ్చాడు. ఆయితే ఆ పార్టీకి వచ్చినవారిలో ఒకరికి కరోనా ఉండటంతో, పార్టీ ఇచ్చిన వ్యక్తికి మళ్లీ కరోనా సోకింది. ప్రస్తుతం ఆ ఇద్దరికీ వైద్యులు చికిత్స అందిస్తున్నారట.